* దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 188 ఏర్పాటు
* చర్లపల్లి నుంచీ విశాఖకు రెండు స్పెషల్ సర్వీసులు
* 20 కోచ్‌లతో ‘వందేభారత్’
హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): దక్షిణ మధ్య రైల్వేశాఖ క్రమం తప్పకుండా పండుగ సీజన్లలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. దీనిలో భాగంగా ఈ సంక్రాంతికి ఏకంగా 188 ప్రత్యేక రైళ్లు నడిపించనున్నది. మరో 178 ప్రత్యేక రైళ్లు జోన్ నుంచి వెళ్తాయి. ఇలా మొత్తం 366 ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు సేవలందించనున్నాయి.
ఈ రైళ్లు కూడా సెలవు దినాలకే ఎక్కువగా కేటాయించడం విశేషం. ఇప్పటివరకు 16 కోచ్‌లతో నడుస్తోన్న -విశాఖ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు అదనంగా నాలుగు కోచ్‌లు జత కానున్నాయి. ఈ సౌకర్యం శనివారం నుంచే అందుబాటులోకి వస్తుంది. దీంతో 1,128 ఉన్న క్యాపాసిటీ, 1440కి చేరుకుంటుంది.
చర్లపల్లి నుంచీ రైళ్లు
చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం సంక్రాంతికి కలిసివచ్చింది. ఈ స్టేషన్ నుంచి రైల్వేశాఖ నర్సాపూర్ , కాకినాడ, విశాఖ, శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు మొత్తం 59 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. వీటిలో సాధారణ కోచ్‌లతో 16 జన్ సాధారణ్ రైళ్లు విశాఖపట్నం వరకు, అక్కడి నుంచి తిరిగి చర్లపల్లికి నడుస్తాయి.
సంక్రాంతి సందర్భంగా నర్సాపూర్, కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, మచిలీపట్నం, తిరుపతి, బెర్హంపూర్, జైపూర్, గోరఖ్‌పూర్, కటక్, మధురై, అర్సికెరెకూ ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. జన సాధారణ్ రైళ్లకు అదనంగా మరో 15 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు కోచ్‌లు జత చేసి, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి వీటితోపాటు జోన్ నుంచి నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, వరంగల్, స్టేషన్ల మీదుగా చెన్ను, బెంగళూరు, మధురై నుంచి వచ్చే షాలిమార్, సంబల్పూర్, బరౌని, విశాఖపట్నం మొదలైన స్టేషన్లకూ మరికొన్ని ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి.
చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి శనివారం ఏపీలోని విశాఖపట్నానికి రెండు అన్ రిజర్వ్‌డ్ రైలును నడుపుతున్నట్లు ద.మ.రైల్వే అధికారులు తెలిపారు. సాయంత్రం 4.15 గంటలకు చర్లపల్లి నుంచి రైలు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు విశాఖ చేరుకుంటుంది.
12న విశాఖలో ఉదయం 8 గంటలకు బయల్దేరి, రైలు మరుసటి రోజు రాత్రి 9.20 గంటలకు చర్లపల్లి టెర్మినల్‌కు చేరుకుంటుంది. జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ తదితర స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.