హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): దీపావళి, ఛఠ్ పూజా పండుగల సందర్భంగా రైల్వే శాఖ దేశవ్యాప్తంగా 7,435 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. గత ఏడాది 4,500 ప్రత్యేక రైళ్లు నడుపగా, ఈ ఏడాది భారీగా పెంచింది. దక్షిణ మధ్య రైల్వే ఈ పండుగ సీజన్‌లో వివిధ గమ్యస్థానాలకు 860 ప్రత్యేక రైళ్లను నడుపు తున్నదని అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే 234 రైళ్లను అధికంగా నడుపుతున్నట్టు వెల్లడించారు.
ఈ నెల 3న 32 ప్రత్యేక రైళ్లు నడపగా... సోమవారం మరో 37 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు చెప్పారు. మణుగూరు, మహబూబ్‌నగర్, కరీంనగర్ నుంచి కూడా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు తెలిపారు. కాకినాడెే- సికింద్రాబాద్, కాకినాడ -లింగంపల్లి, సికింద్రాబాద్ తిరుపతి, సికింద్రాబాద్ రక్సౌల్, కాచిగూడ మధురై, సికింద్రాబాద్ కాచిగూడ -నిజాముద్దీన్, మౌలాలి -ముజఫర్‌పూర్, మణుగూరు బెల్గాం తదితర రైళ్లు తెలంగాణ నుంచి వివిధ ప్రాంతాలకు, అక్కడి నుంచి తెలంగాణకు నడుస్తున్నాయని వివరించారు.