అభివృద్దికి ఆమడ దూరంలో ఉన్న పని చేయని పాలకవర్గం
కాగితాలకే పరిమితమైన వార్డు కమిటీలు
పర్యవేక్షణకు నోచుకోని ప్రత్యేక అధికారులు
పట్టించుకోని ఉన్నతాధికారులు
రానున్న అత్యధిక నిధులు వాటిని వినియోగించే పరిస్థితుల్లో వార్డు కమిటిలపై అనుమానాలు
వనపర్తి,(విజయక్రాంతి): వనపర్తి మున్సిపాలిటి వ్యవస్థ అస్థవస్థ్యంగా తయారు అయింది. ఆయా వార్డులో జరగాల్సిన అభివృద్ది కార్యక్రమాలు నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులు, పాలకవర్గం పూర్తిగా విఫలం అయ్యిందని పట్టణ వాసులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. వార్డుల వారిగా వార్డు కమిటిలను ఏర్పాటు చేసి వాటి అధ్యక్ష పదవులను కూడా అనుభవిస్తూ ఏ రోజు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నిధులు వినియోగం, సమస్యలను పరిష్కరించకుండా కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయి. రాజకీయాలకు అతీతంగా ఒక్కో వార్డుల్లో సుమారు 15 నుండి 20 మందికి దాకా యువకులు, మహిళలు, విద్యావేత్తలు, సీనియర్ సిటిజన్స్‌లను వార్డు కమిటిలో సభ్యులుగా చేరినప్పటికి ఏ రోజు కూడా ప్రజా సమస్యలను వెలుగెత్తిన దాఖలాలు లేవు.
కనీసం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశాలు జరపాల్సిన ఆ కమిటి తాము ఉన్నామన్న సంగతి మరిచి కేవలం వార్డు కమిటిలుగా చెలామణి అవుతున్నారని విమర్శలు ఉన్నాయి. ఆయా కౌన్సిలర్ తనకు అనుకూలమైన వ్యక్తులను వార్డు కమిటి సభ్యులు, అధ్యక్షులుగా నియమించుకుని వారి అవినీతి అక్రమాలకు వారి అడుగులకు మడుగులు ఒత్తే విధంగా మార్చుకుని ప్రజా సమస్యలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వార్డు కమిటిలపై పర్యవేక్షణ ఆయా వార్డుల్లో సమస్యలను పరిష్కారించాల్సిన వార్డు ప్రత్యేకాధికారులు కార్యాలయానికి పరిమితమై నెలసరి జీతాన్ని పొందడానికి ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి.
ఆయా వార్డుల్లో పేరుకుని పోయిన చెత్తా చెదారం, విద్యుత్ సమస్యలు, డ్రైనేజి, సీసీ రోడ్డు, మంచీనీరు వంటి సమస్యలను ఏ ఒక్క రోజు పట్టించుకున్న పాపాన పోలేదని పట్టణ వాసులు మండిపడుతున్నారు. ప్రభుత్వం నుండి 14 వ ఆర్థిక సంఘం, ఎస్సీ, ఎస్టీ, టఫ్‌ఐడిసి నిధులను సక్రమంగా వినియోగించకపోవడంతో ప్రజా ధనం పూర్తిగా లూటి అవుతుందని విమర్శలు ఉన్నాయి. ఎస్సీ. ఎస్టీ సంబంధిత నిధులు సైతం ఆయా ఎస్సీ. ఎస్టీ వార్డుల్లోనే వినియోగించాల్సిన ఉన్న కొంతమంది అధికారులు, కౌన్సిలర్లు కుమ్మక్కై వాటిని పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మున్సిపాలిటి పాలకవర్గం కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి వార్డు కమిటి అధ్యక్షులతో సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్న తమకేమి సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తూ కౌన్సిల్ సమావేశాన్ని తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
డిసెంబర్ నెలలో వచ్చే నిధులు అయిన ప్రజా సమస్యల పరిష్కారానికి వినియోగించేనా?
వనపర్తి మున్సిపాలిటిలో 33 వార్డులు కాగా ఆయా కౌన్సిలర్లు తమకు అనుకూలంగా ఉన్న వారిని వార్డు కమిటి అధ్యక్షులు, సభ్యులు నియమించుకున్నారు. రాబోయే డిసెంబర్ నెలలో భారి మొత్తంలో పట్టణాభివృద్ది కోసం నిధులు రానున్నాయని వీటిని వార్డు అభివృద్ది కోసం వినియోగించేలా ప్రణాళికలను రచించామని ఇటీవల ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలపడం జరిగింది. కాని గతంలో మాదిరిగా వార్డు కమిటిలను కాగితాలకే పరిమితం చేసి వార్డులకు కొంత చొప్పున నిధులను కెటాయించుకున్నారా లేక వార్డులో ఉన్న ప్రధాన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం దిశగా ముందుకు సాగుతారా అన్న అంశం తేలాస్సి ఉంది.
వార్డు కమిటిలను పునర్ ప్రారంభం చేయాలి: గోపాలకృష్ణ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, వనపర్తి
కాగితాలకే వార్డు కమిటిలను పరమితం చేశారు. వార్డు అభివృద్ది సమస్యలపై ఏ నాడు మున్సిపాలిటి అధికారులు, చైర్మన్‌లు సమావేశాలు పెట్టిన సందర్భాలు లేవు. విలీన గ్రామాలు సైతం వనపర్తి మున్సిపాలిటి పరిధిలో కలిసి 33 వార్డులుగా ఏర్పడిన అక్కడ అభివృద్ది జరిగిన దాఖలాలు లేవు. వార్డు కమిటిలను పునర్ ప్రారంభం చేసి వార్డు సమస్యలను గుర్తించి వాటి పరిష్కార దిశగా అటు అధికారులు, ఇటు పాలక వర్గం ముందుకు సాగినప్పుడు అభివృద్ది వేగవంతం అవుతుంది.
ప్రజా సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తాం: పుట్టపాకుల మహేష్, మున్సిపాలిటి చైర్మన్, వనపర్తి
ఆయా వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కార దిశగా ముందుకు సాగుతున్నాం. ఇప్పటికే పలు వార్డులో నెలకొన్న ప్రధాన సమస్యలను గుర్తించడం జరిగింది. డిసెంబర్ నెలలో రాబోయే నిధుల నుండి మున్సిపాలిటి పరిధిలో గల ప్రతి వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీల పనులను ప్రారంభించబోతున్నాం. అధికారులు మారడం వల్ల కొంత జాప్యం జరిగింది. వార్డు కమిటిల అధ్యక్షులు ప్రత్యేకాధికారులతో చర్చించి ప్రజా సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది.