బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఏపీలాగే బీహార్ కూడా ఎన్నో ఏళ్లుగా కేంద్రాన్ని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతోంది. ఇప్పడు కేంద్రప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నామని భావిస్తున్న ఆయన ఇదే సరయిన సమయమనే ఉదేశ్యంతో ప్రత్యేక హోదా సహా తన కోర్కెల చిట్టాను మరోసారి తెరపైకి తెచ్చారు. శనివారం ఢిల్లీలో నితీశ్ అధ్యక్షతన జరిగిన జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసింది. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధిలో వెనుకబడి ఉండడాన్ని పార్టీ తన తీర్మానంలో ప్రస్తావించింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని, దీర్ఘకాలంగా ఉన్న ఈ డిమాండ్‌ను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రత్యేక హోదా లేదంటే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేసింది. కుల రిజర్వేషన్లపై పాట్నా హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కూడా శనివారం జరిగిన జేడీయూ సమావేశంలో నిర్ణయించారు. అయితే ప్రత్యేక హోదా కొత్త డిమాండ్ కాదని, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ కోసం పోరాడుతూనే ఉంటామని పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నికయిన రాజ్యసభ ఎంపీ సంజయ్ ఝా విలేఖరులకు చెప్పారు.
నితీశ్ ప్రత్యేక హోదా డిమాండ్ చేయడం ఇదేమీ కొత్త కాదు. గత ఏడాది బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించారు. అయితే అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా ఉంది. అప్పుడు ఆయన కాంగ్రెస్, ఆర్జేడీలతో కలిసి ‘మహాఘట్‌బంధన్’ కు నేతృత్వం వహించారు. ఈ ఏడాది జనవరిలో ఆ కూటమికి గుడ్‌బై చెప్పి తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూమిలో చేరారు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమిలో ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీతో పాటు ఆయన పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా ఏపీకి ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన కారణంగా ఏపీ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని, అందుకే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన గతంనుంచీ డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వడం లేదంటూ కేంద్రం ఈ డిమాండ్‌ను అప్పట్లో తోసిపుచ్చింది. ఆ కారణంగానే ఆయన ఎన్డీఏ కూటమినుంచి బయటికి రావడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల కారణంగా తిరిగి ఆ కూటమి గూటికి చేరడం తెలిసిందే. ఇటీవల రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా ప్రత్యేక హోదా డిమాండ్ వినిపిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ సాధించలేకపోయిన మోడీ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటుకు ప్రధానంగా తెలుగు దేశం, జేడీ యూ పార్టీలపైన ఆధారపడాల్సి వచ్చింది.
ఈ రెండు పార్టీలకు జనసేన కలిస్తే లోక్‌సభలో 30 మంది సభ్యుల బలం ఉంది. ప్రస్తుత లోక్‌సభలో బీజేపీ బలం 240 మాత్రమే. ఈ నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం మనుగడకు ఈ రెండు పార్టీల మద్దతు అత్యంత కీలకంగా మారింది. మరోవైపు వచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. రాష్ట్రంలో నితీశ్ తిరిగి అధికారంలోకి రావాలంటే ఎంతో కొంత అభివృద్ధి చేసి చూపించక తప్పని పరిస్థితి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో కేంద్రం నుంచి భారీగా నిధులను రాబట్టుకోవలసిన అగత్యం ఏర్పడింది. అయితే కేంద్రం బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవచ్చని, ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ బీహార్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే ఏపీకి కూడా ఇవ్వాల్సి వస్తుంది.అదే జరిగితే ఇతర రాష్ట్రాలనుంచి కూడా ఇదే విధమైన డిమాండ్లు రావచ్చు. మరి కేంద్రం ఈ విషయంలో ఏం చేస్తుందో వేచి చూడాలి.