డిమాండ్ల చిట్టా విప్పుతున్న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్
జేడీయూ భేటీలో తీర్మానం
బీసీలకు కోటా పెంచాలని నిర్ణయం
మళ్లీ ప్రత్యేక హోదా రాగం అందుకున్న బీహార్ సీఎం
గతంలోనే క్యాబినెట్ తీర్మానం
న్యూఢిల్లీ, జూన్ 29: ఎన్డీయే కూటమిలో ముఖ్య భాగస్వామిగా ఉన్న బీహర్ ముఖ్యమంత్రి, జనతాదళ్ యునైటెడ్ అధినేత నితీశ్ కుమార్ మళ్లీ ప్రత్యేక హోదా రాగం అందుకున్నారు. శనివారం జరిగిన జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ కావాలనే డిమాండ్‌పై తీర్మానం ఆమోదించారు. బీహార్‌కు ప్రత్యేక హోదా కావాలని నితీశ్ క్యాబినెట్ గతంలోనే తీర్మానించినా... ఆ డిమాండ్ నెరవేరలేదు.
నితీష్ మద్దతు ముఖ్యం
కేంద్రంలోని ఎన్డీయే సర్కారుకు జేడీయూ అధినేత నితీశ్ కుమార్ మద్దతు చాలా అవసరం. మొన్నటి ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన బలం లేకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కూటమిలో బీజేపీ, టీడీపీ తర్వాత అత్యధిక ఎంపీ స్థానాలున్న పార్టీగా జేడీయూ ఉంది. కావున కేంద్రంలో అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ పార్టీకి జేడీయూ మద్దతు చాలా కీలకం. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మోదీ సారధ్యంలోని బీజేపీ ఏం చేస్తుందనేది అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.
చివరిసారిగా ప్రత్యేక హోదా కోసం తీర్మానం చేసినపుడు నితీశ్ కుమార్ పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది. కానీ తదనంతర పరిణామాలలో భాగంగా ఆయన ఇండియా కూటమికి గుడ్ బై చెప్పి బీజేపీకి చెందిన ఎన్డీయే కూటమిలో చేరారు. ఎన్డీయే కూటమిలో 12 సీట్లతో నితీష్ పార్టీ ముఖ్యభూమిక పోషిస్తోంది. ఇటువంటి సమయంలో నితీష్ కుమార్ కేంద్రం ముందు ప్రత్యేక హోదా డిమాండ్‌ను ఉంచడం హాట్ టాపిక్ అయింది. మరి నితీష్ పార్టీ డిమాండ్‌ను పోయినసారి పక్కన పెట్టిన మోదీ ప్రభుత్వం ఈ సారి మాత్రం అలా పక్కన పెట్టే అవకాశం లేకుండా పోయింది. రాజ్యసభ ఎంపీ సంజయ్ ఝా జనతాదళ్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు.
రిజర్వేషన్లూ పెంచాల్సిందే
వెనుకబడిన తరగతుల వారికి, షెడ్యూల్డ్ కులాల వారికి, షెడ్యూల్డ్ తెగల వారికి పెంచిన రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చాలని జేడీయూ డిమాండ్ చేసింది. ఇటీవల చేసిన కులగణన ప్రకారం వెనుకబడిన వర్గాలకు 65 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న బీహార్ ప్రభుత్వ నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు అడ్డుకున్న విషయం తెలిసిందే.