- జూలై మొదటివారంలో ముగియనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం
ఎన్నికలు అక్టోబర్‌లో?
ఇప్పటికే పంచాయతీల్లో ప్రత్యేక పాలన
సూర్యాపేట, జూన్ 28 (విజయక్రాంతి): మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికలు ఇప్పట్లో జరిగే పరిస్థితులు కన్పించడం లేదు. జూలై4తో ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీ కాలం కూడా ముగియనుంది. ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంటే ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికల కసరత్తు ప్రారంభించాలి. కానీ అలాంటి పరిస్థితులు ఏవీ లేవు. అంటే మండల, జిల్లా పరిషత్‌ల్లోనూ ప్రత్యేకాధికారుల పాలనే రానున్నదని స్పష్టమవుతోంది. ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది.
రాష్ట్రంలో 538 జెడ్పీటీసీ, 5,984 ఎంపీటీసీలు
తెలంగాణలో 535 మండలాలు ఉన్నాయి. 2019 మే నెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. అదే సంవత్సరం జూలై 3న ఎంపీటీసీలు, 4న జడ్పీటీసీలు బాధ్యతలు చేపట్టారు. ఈ లెక్కన వారి పదవీ కాలం వచ్చే నెల 4వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 538 జడ్పీటీసీ, 5,984 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.
ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే!
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ పదవీ కాలం ఫిబ్రవరి 2తో ముగిసింది. ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. అయితే అసెంబ్లీ , పార్లమెంట్, పట్టభ్రదుల ఎమ్మెల్సీ ఎన్నికలు వరుసగా రావడంతో దాదాపు 5 నెలల పాటు ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దీంతో కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీల అమలుకు అవకాశం దొరకలేదు. అంతేకాకుండా గతంలో మెజార్టీ సభ్యులందరూ బీఆర్‌ఎస్ నుంచే గెలిచారు. ఇందులో కొందరు కాంగ్రెస్‌లో చేరినా పల్లెల్లో పట్టు సాధించే వరకు ఎన్నికలకు వెళ్లకుండా ఉండటమే మంచిదని ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆగష్టు 15 నాటికి రుణమాఫీ చేసి అక్టోబర్ చివరిలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.