calender_icon.png 26 April, 2025 | 7:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘చెక్ బీపీ.. స్టాప్ స్ట్రోక్’

26-04-2025 01:04:47 AM

ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం 

గుంటూరు, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): అదుపులోలేని హైబీపీతో స్ట్రోక్ వస్తే జీవితం ఒక్కసారిగా తలకిందులు అవుతుందని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంపి కృష్ణబాబు తెలిపారు. శుక్రవారం భారతీయ విద్యాభవన్ ప్రాంగణంలో ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ (ఐఎస్‌ఏ), ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన ‘చెక్ బీపీ.. స్టాప్ స్ట్రోక్’ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏటా 18 లక్షల మందికి పైగా స్ట్రోక్‌తో బాధపడుతున్నారని తెలిపారు. హై బ్లడ్ ప్రెషర్ వంటి ప్రమాదకర కారకాలను ప్రజలకు తెలియజెప్పడం, అదుపు చేయడం ద్వారా బ్రెయిన్ స్ట్రోక్, మాత్రమే కాకుండా పీవీడీ, గుండెపోటు, మూత్రపిండాల వైఫల్యం వంటి అనేక రోగాలను ముందుగానే నివారించవచ్చు అన్నారు.

ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్న ఐఎస్‌ఏ అధ్యక్షురాలు డాక్టర్ విజయను అభినందించారు. ఐఎస్‌ఏ అధ్యక్షురాలు డాక్టర్ విజయ మాట్లాడుతూ.. అధిక రక్తపోటు వల్ల భారతదేశంలో ప్రతి నిమిషం ముగ్గురికి బ్రెయిన్ స్ట్రోక్ ప్రతి ఏడాది 18 లక్షల మందికి పైగా స్ట్రోక్ తో బాధపడుతున్నారని తెలిపారు. అందులో 25 శాతం మంది  40 సంవత్సరాల లోపేనని వివరించారు. అవగాహన నియంత్రణ ద్వారా 80శాతం వరకు స్ట్రోక్లు నివారించవచ్చు అన్నారు. 18 సంవత్సరాలు పైబడినవారు బీపీని నెలలో కనీసం ఒకసారి చూపించుకోవాలన్నారు.

బీపీని గుర్తించి నియంత్రిస్తే 50 శాతం బ్రెయిన్ స్ట్రోక్లు తప్పించుకోవచ్చు అని తెలిపారు. బీపీ చెక్ చేయించుకోండి కాపాడండి అనే సందేశాన్ని అన్ని వర్గాల మీడియా సహకారంతో ప్రజల మధ్య విస్తృతంగా పంచుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో, దేశ వ్యాప్తంగా విస్తరించనున్నట్లు ఐఎస్‌ఏ కార్యదర్శి డాక్టర్ అర్వింద్ శర్మ ప్రకటించారు. కార్యక్రమంలో ఉచిత బీపీ పరీక్షలు వేదిక వద్ద ప్రారంభించి గుంటూరులోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (జిజి హెచ్), లాయర్ల అసోసియేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డ్రగ్ హోల్సేల్, రిటైల్ అసోసియేషన్లు, ఎస్ హెచ్ ఓ, మల్లినేని ఇంజనీరింగ్ కాలేజీ, ప్రజా వేదిక వంటి ప్రదేశాలలో నిర్వహించారు. తదుపరి మొబైల్ బీపీ బస్సును కృష్ణబాబు ప్రారంభించారు.