జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా గ్రేటర్ వ్యాప్తంగా 73 ప్రాంతాల్లో ప్రత్యేక పాండ్స్‌ను సిద్ధ్దం చేసినట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. ఈ సందర్భంగా గణేష్ నిమజ్జనానికి ఏర్పాటు చేసిన పాండ్స్ వివరాలను శుక్రవారం కమిషనర్ వెల్లడించారు. వీటిలో 27 బేబీ పాండ్స్, 24 పోర్టబుల్, 22 ఎస్కవేటివ్ పాండ్స్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు.
ఈ పాండ్స్‌లలో పెద్ద విగ్రహాలు కాకుండా 2 నుంచి 5 అడుగుల కలిగిన చిన్న విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామన్నారు. గ్రేటర్‌లో పర్యావరణ హితంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవడానికి జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా 3.10 లక్షల మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశామన్నారు. శోభాయాత్ర సందర్భంగా ప్రధాన రోడ్లలో నిరంతరం మెరుగైన సానిటేషన్ నిర్వహణకు కిలోమీటరుకు ఒక టీం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.