calender_icon.png 14 January, 2025 | 5:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

12 గంటల పాటు ప్రత్యేక ఆపరేషన్

15-09-2024 02:01:01 AM

  1. ఏకంగా 30 లక్షలు విలువ చేసే అల్ఫాజోలం పట్టివేత 
  2. పరారీలో సూత్రధారుడు.. పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు

కామారెడ్డి,సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, సిబ్బంది జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలంలో 12 గంటల పాటు స్టింగ్ ఆపరేషన్ చేశారు. పక్కా స్కెచ్‌తో రూ.30 లక్షల విలువైన ఆల్ఫాజోలాన్ని స్వాధీనం చేసుకున్నారు. దందాతో ప్రమేయం ఉన్న ముగ్గురి అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సూత్రధారుడు పరారీలో ఉన్నాడు. నిజామాబాద్ ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నాగిరెడ్డిపేట మండలం గోపాల్‌పేట్‌లో, మాసానిపేటలో కొందరు కృత్రిమంగా అల్ఫాజోలం తయారు చేసి, దానిని కల్లులో కలుపుతున్నారు.

అలా కల్లును కల్తీ చేసి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గాంధారి, నాగిరెడ్డి పేట్, లింగంపేట్, సదాశివనగర్, రామారెడ్డి ,మాచారెడ్డి, బిక్కనూర్, బీబీపేట్, దోమకొండ, రాజంపేట, తాడ్వాయి, బిచ్కుంద, పిట్లం నిజాంసాగర్ తదితర ప్రాంతాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వారిని పట్టుకునేందుకు శుక్రవారం రాత్రి ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, సిబ్బంది వేట ప్రారంభించారు.

12 గంటల పాటు ఆపరేషన్ కొనసాగించి ముగ్గరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 3.5 కిలోల  రూ.30 లక్షలు విలువ  చేసే అల్ఫాజోలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే.. కల్తీ కల్లు దందా వెనుక ఉన్న అసలు సూత్రధారి తప్పించుకున్నాడు. నిందితుడి కోసం ఎక్సైజ్‌శాఖ గాలింపు చర్యలను ముమ్మరం చేసింది.