జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే...
కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూనే నాణ్యమైన విద్యాబోధన అందించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ మండలం మాలన్ గొంది గ్రామంలోనీ గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి తరగతి గదులు, రిజిస్టర్లు, మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు నిష్ణాతులైన ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు శుద్ధమైన త్రాగునీటిని అందించాలని, పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని తెలిపారు.
ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ పథకం ద్వారా జిల్లాలో చేపట్టిన పనులను నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు తీసుకోవాలని తెలిపారు. అనంతరం గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా తడి చెత్త, పొడి చెత్త సేకరణ, వర్మి కంపోస్టు తయారీ, నర్సరీల నిర్వహణ విధులలో అలసత్వం, నిర్లక్ష్యం వహించిన పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలకు ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా హాజరుకావాలని, విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. గ్రామపంచాయతీ పరిధిలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, మురుగు కాలువలు, కనీస మౌలిక వసతులు కల్పించే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.