calender_icon.png 30 April, 2025 | 7:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం తరలింపునకు ప్రత్యేక చర్యలు

30-04-2025 12:52:07 AM

సిరిసిల్ల, ఏప్రిల్ 29(విజయక్రాంతి): జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యం తరలింపులకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో యాసంగి సీజన్లో ధాన్యం సేకరణ తరలింపు తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయం మంగళవారం సమావేశంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలసి సమీక్షించారు. ముందుగా జిల్లాలోని ఆయా మండలాల వారిగా ఎంత ధాన్యం ఉత్పత్తి అయిందో వ్యవసాయ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఐకెపి, పిఎసిఎస్, డిసిఎంఎస్ తదితర కేంద్రాల ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఎన్ని క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు .

ఎంత మిల్లులకు తరలించారో ఆరా తీశారు. తేదీ 28- 04 - 2025 వరకు మొత్తం 50 వేల మెట్రిక్ టన్నులు సేకరించామని అధికారులు తెలిపారు. రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రైతులు ధాన్యం విక్రయించడంలో ఎలాంటి ఇబ్బందులు పడవద్దని సీఎం రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు.  కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని తరలించేందుకు ఒప్పందం చేసుకున్న లారీల కాంట్రాక్టర్ జిల్లాలోని ఐదు రూట్లలో దాదాపు 500 లారీలు సమకూర్చాల్సి ఉందని తెలిపారు.

సదరు కాంట్రాక్టర్ 180 లారీల వరకు సమకూర్చడంతో దాన్యం తరలింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వెల్లడించారు. ఇప్పటికిప్పుడు ధాన్యం తరలింపునకు ప్రత్యామ్నాయంగా జిల్లాలోని వంద లారీలను అలాగే రైస్ మిల్లర్ల పరిధిలోని 50 లారీలను సిద్ధంగా ఉంచామని తెలిపారు.  రుద్రంగి, చందుర్తి, కోనరావుపేట, అలాగే బోయిన్పల్లి, ఇల్లంతకుంట తదితర మండలాల్లో సేకరించిన ధాన్యాన్ని వెంట వెంటనే తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.

కూలీల ఇబ్బంది లేకుండా కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. వేములవాడ నియోజకవర్గంలోని 74 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసి, నేటి నుండి వెంట వెంటనే తరలించాలని విప్ అధికారులను ఆదేశించారు. రుద్రంగి పరిధిలో. కొనుగోలు చేసిన ధాన్యాన్ని అలాట్ చేసిన రైస్ మిల్లులకు తరలిస్తూనే స్థానిక ఏ.ఎం.సి. గోడౌన్లో కూడా నిల్వ చేయాలని విప్ ఆదేశించారు. దాన్యం కొనుగోలు చేసిన వెంటనే తరలించేరా అధికారులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. సమీక్ష సమావేశంలో డిఆర్డిఓ శేషాద్రి, డీ సి ఎస్ ఓ వసంత లక్ష్మి, డిఎం రజిత, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జలీ బేగం, డిసిఓ రామకృష్ణ, డి టి వో లక్ష్మణ్, ఆయా మండలాల వ్యవసాయ అధికారులు, ఐకెపి ఏ.పి.ఎం.లు తదితర అధికారులు పాల్గొన్నారు.