calender_icon.png 13 February, 2025 | 4:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీసీసీ ప్రత్యేక మ్యానిఫెస్టో

03-05-2024 12:24:18 AM

నేడు విడుదల చేయనున్న సీఎం రేవంత్ 

ఇప్పటికే ఏఐసీసీ ‘పాంచ్ న్యాయ్’ పత్రం

రాష్ట్రానికి ప్రత్యేకంగా మ్యానిఫెస్టో రూపకల్పన

అదనంగా మరిన్ని హామీలివ్వనున్న కాంగ్రెస్ 

హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. అందుకు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఐదింటిని అమలు చేస్తున్నామని చెప్తూనే.. మరోవైపు ఏఐసీసీ ప్రకటించిన మ్యానిఫెస్టో ‘పాంచ్ న్యాయ్’ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. జాతీయ స్థాయిలో ఏఐసీసీ మ్యానిఫెస్టోకు అదనంగా రాష్ట్ర కాంగ్రెస్ విభాగం మరికొన్ని హామీలతో తెలంగాణకు ప్రత్యేక మ్యానిఫెస్టో ప్రకటించేందుకు సిద్ధమైంది.

ఈ మ్యానిఫెస్టోను సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం విడుదల చేయనున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఏంచేస్తారో ఈ మ్యానిఫెస్టోలో ప్రకటించనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి కేంద్రం నుంచి తీసుకొచ్చే నిధులు, ప్రాజెక్టులపై హామీ ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. వీటిలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపర్చిన హామీలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్ పాఠశాలలతో పాటు ఇతర అంశాలకు చోటు కల్పించే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు అప్పటి యూపీఏ ప్రభుత్వం అనేక హామీలను చట్టంలో చేర్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ విభజన హామీలను పట్టించుకోలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాటన్నింటిని అమలు చేస్తామన్న హామీని లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. 

పీసీసీ మ్యానిఫెస్టోలో ఉంటాయని చెప్తున్న అంశాలు 

*  హైదరాబాద్‌లో ఐటీఐఆర్ ఏర్పాటు

* కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, హైదరాబాద్‌లో ఐఐఎం, హైదరాబాద్ విజయవాడ హైవేలో ర్యాపిడ్ 

రైల్వే విధానం, మైనింగ్ యూనిర్సిటీ.

* భద్రాచలంలోని ముంపు గ్రామాలు తెలంగాణలో విలీనం 

* పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా 

* హైదరాబాద్‌లో నీతి ఆయోగ్ రీజినల్ ఆఫీసు 

* కొత్త విమానాశ్రయాలు 

* రామగుండం  మణుగూరు రైల్వేలైన్ 

* రాష్ట్రంలో నాలుగు కొత్త సైనిక్ స్కూల్స్ ఏర్పాటు 

* కేంద్రీయ విశ్వ విద్యాలయాలు

* నవోదయ విద్యాలయాలు రెట్టింపు చేయడం 

* ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ 

* జాతీయ స్పోర్ట్స్ యూనివర్సిటీ 

* ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ 

* నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ 

* ఇండియన్ అగ్రికల్చర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాంపస్ 

* ఐసీఎంఆర్ పరిధిలో అడ్వాన్స్‌డ్ మెడికల్ అండ్ హెల్త్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 

* కేంద్రం నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు అందజేత 

* ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్తు ఏర్పాటు 

* హైదరాబాద్  బెంగళూరు, హైదరాబాద్  నాగపూర్, హైదరాబాద్  వరంగల్, హైదరాబాద్  మిర్యాలగూడ, సింగరేణి వరకు కొత పారిశ్రామిక కారిడార్లు. 

* అంతర్జాతీయ స్థాయి కల్చరల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్ 

* మేడారం జాతరకు జాతీయ హోదా 

* డ్రైపోర్టు నిర్మాణం 

* హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్ 

ఏఐసీసీ పాంచ్ న్యాయ్ పత్రంలోని ప్రధానాంశాలు 

* దేశవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక కులగణన 

* ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్ల పరిమితి పుంపు

* ప్రజలందరికీ రూ.25 లక్షల వరకు నగదు రహిత బీమా 

* పేద మహిళలకు ఏడాదికి రూ.లక్ష ఆర్థిక సాయం 

* రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర చట్టం 

* దివ్యాంగుల హక్కుల చట్టం కఠినంగా అమలు చేయడం 

* రైతులను ఆదుకోవడానికి రుణమాఫీ 

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వు చేసిన పోస్టులను ఏడాదిలో భర్తీ చేయడం 

ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్ రెట్టింపు 

* ప్రతి జిల్లాలో లైబ్రరీలతో కూడిన అంబేద్కర్ భవనాలు 

* కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ 

* ఉపాధిహామీ పథకం కింద ఇచ్చే కూలీ రోజుకు రూ.400 వరకుపెంపు 

* అగ్నిపథ్ పథకం రద్దు 

* ప్రభుత్వ ఉద్యోగాల పరీక్ష ఫీజుల రద్దు 

* మార్చి నాటికి ఉన్న విద్యా రుణాల మొత్తం రద్దు 

* తప్పుడు వార్తల నియంత్రణకు 1978 నాటి ప్రెస్ కౌన్సిల్ ఇండియా చట్టానికి సవరణ.