22-03-2025 01:10:32 AM
హైదరాబాద్, మార్చి 21 (విజయక్రాంతి): న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం పరిశీలన చేస్తోందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమ నిధి పెంచడంతోపాటు ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణం విషయంలోనూ ఆలోచన చేస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం, తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ గుమస్తాల చట్టసవరణపై శుక్రవారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ఆ రెండు బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, జీ మధుసూదన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్ చేసిన సూచనలపై మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ..
తెలంగాణ బార్ కౌన్సిల్ తీర్మానాల మేరకు న్యాయవాదులు, వారి గుమస్తాల స్టాంప్ విలువను రూ.100 నుంచి రూ.250వరకు పెంచాలనే తీర్మానానికి శాసనసభలో ఆమోదం లభించిందని, స్టాంప్ విలువ పెంచడంలో ప్రభుత్వ ప్రమేయంలేదని తెలిపారు. హైకోర్టు నూతన భవనాన్ని 100 ఎకరాల్లో నిర్మించడానికి ప్రభుత్వం నిధులు కేటాయింపు చేసిందన్నారు.
తెలంగాణ న్యాయవాదులను జాతీయస్థాయిలో ‘న్యాయ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు కొత్తగా నిర్మించే హైకోర్టు భవన్ ఆవరణలో 10 ఎకరాల్లో ప్రత్యేక లా యూనివర్సిటీని నెలకొల్పాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ చేసిన సూచనలను ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన న్యాయవాదులకు ఇంటిస్థలాలు, స్కాలర్‌షిప్ ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, హెల్త్‌కార్డులు, పెన్షన్ సౌకర్యం కల్పించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని, న్యాయవాదుల సంక్షేమ నిధిని రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్లకు పెంచాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కోరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ..
న్యాయవాదులకు ఇన్సూరెన్స్ సౌకర్యంతో పాటు కొత్తగా న్యాయవాదులుగా వచ్చే వారికి స్కాలర్‌షిప్ ఇవ్వాలని కోరారు. కోర్టుల్లో కేసులు వాదించేటప్పుడు శిక్షపడిన వారు న్యాయవాదులపై కక్షలు పెంచుకుని దాడులకు దిగడమే కాకుండా హత్యలు కూడా చేస్తున్నారని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
కోర్టు భవనాల కోసం రూ. 1000 కోట్లు
మండలిలో వెల్లడించిన మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, మార్చి 21 (విజయక్రాంతి): నూతన కోర్టు భవనాల నిర్మాణం కోసం రూ. 1000 కోట్ల నిధుల విడుదలకు పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. శుక్రవారం శాసనమండలిలో అడ్వకేట్ , గుమాస్తాల సంక్షేమ చట్టం సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టిన సందర్భంగా సభ్యులు ప్రస్తావించిన అంశాలపై మంత్రి వివరణ ఇచ్చారు.
కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాల్లో కోర్టుల నిర్మాణాలు జరుగుతాయన్నారు. నూతన హైకోర్టు భవన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి 100 ఎకరాల స్థలం కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. నూతన హైకోర్టు, న్యాయమూర్తుల నివాస సముదాయాల నిర్మాణానికి రూ. 2600 కోట్లు వ్యయం చేయనున్నట్టు తెలిపారు.
19,830 మంది అడ్వొకేట్లు, వారి కుటుంబ సభ్యులు మొత్తం 55,000 మందికి రూ.2 లక్షల పరిమితితో హెల్త్ కార్డుల జారీ, రూ.10లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు వెల్లడించారు. న్యాయవాదుల భద్రత కోసం చట్టాన్ని తీసుకొస్తామని పేర్కొన్నారు. వామనరావు దంపతుల దారుణ హత్యలు న్యాయవాదులను రక్షణ కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయని పేర్కొన్నారు.