26-02-2025 12:27:24 AM
భక్తులు మల్లన్నను దర్శించుకునే అవకాశం
మహాశివరాత్రి సందర్భంగా పర్యాటకశాఖ నిర్ణయం
ఏడాదిలో ఒకసారే స్వామివారి దర్శన భాగ్యం
నల్లగొండ, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి) : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కృషానదిలోని ఏలేశ్వరం కొండకు మహా శివరాత్రి సందర్భంగా మంగళవారం ప్రత్యేక లాంచీలు నడుపునున్నట్లు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ తెలిపింది. నాగార్జున సాగర్ హిల్ కాలనీలోని విజయ విహార్ సమీపంలోని న్యూ బోటింగ్ పాయింట్ నుంచి లాంచ్లు అందుబాటులో ఉంటాయి. పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.200 టికెట్ ధర నిర్ణయించారు. 4 నుంచి 10 ఏండ్లలోపు పిల్లలకు టికెట్లో సగం ధర మాత్రమే ఉంటుంది.
ఏలేశ్వరం మల్లయ్య గట్టుకు చేరుకోవడానికి నాగార్జున సాగర్ నుంచి కృష్ణానదిలో దాదాపు 10 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ప్రయాణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఏడాదికి ఒకసారి శివరాత్రి పర్వదినం రోజు మాత్రమే భక్తుల కు స్వామివారి దర్శన భాగ్యం ఉంటుంది. నదిలో ప్రయాణం అనంతరం దాదాపు రెండు కిలోమీటర్ల మేర కొండను అధిరోహిస్తేనే కొండపై కొలువుదీరిన మల్లయ్య దర్శనం భక్తులకు సాధ్యపడుతుంది. భక్తులకు కొండ కింది భాగంలో స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు తాగునీరు, భోజనం అందిస్తారు.