ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
హైదరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): విద్యార్థులు, నిరుద్యోగ యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు టీ వర్క్స్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ‘స్కిల్ స్ప్రింట్’ పేరిట ప్రత్యేక ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తున్నట్టు రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. తెలంగాణను నైపుణ్యమున్న మానవ వనరులకు చిరునామాగా మార్చుతామని చెప్పారు.
ఇంటర్న్ షిప్‌కు సంబంధించిన పోస్టర్‌ను గురువారం సచివాలయంలో మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తెలంగాణ యువతలో ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందిస్తామని పేర్కొన్నారు. ‘స్కిల్ స్ప్రింట్’ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ వ్యవధి 90 రోజులు ఉంటుందని, ఈ కార్యక్రమంలో భాగంగా ఇంజినీరింగ్, రోబోటిక్స్, మేనేజ్మెంట్, సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్, మార్కెటింగ్ తదితర రంగాల్లో డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని చెప్పారు.
సొంతంగా ప్రాజెక్టులను రూపొందించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తామని, ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా అకాడమిక్ క్రెడిట్స్ ఇస్తామని వెల్లడించారు. ఆసక్తి గల కళాశాలలు, విద్యార్థులు టీవర్క్స్ కార్యాలయంలో సంప్రదించా లని సూచించారు. మరిన్ని వివరాలు Yisu.in లో లభిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో టీవర్క్స్ సీఈవో తనికెళ్ల జోగిందర్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్ ఛమాన్ మెహతాలు తదితరులు పాల్గొన్నారు.