calender_icon.png 23 December, 2024 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశుద్ధ్యంపై ప్రత్యేక ఫోకస్

22-12-2024 03:03:09 AM

*  బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేసేవారికి ఈచలాన్లు: బల్దియా 

* సెన్సార్ సీసీ కెమెరాలతో అలర్ట్

*  కాప్రా సర్కిల్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభం 

*  ప్రత్యేక యాప్ తీసుకు వచ్చేందుకు కసరత్తులు

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 21 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో రహదారులపై ఎక్కడ పడితే అక్కడ చెత్త నిల్వలు దర్శనమివ్వకుండా బల్దియా ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా రోడ్డుపై, బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేసే  వారికి అప్పటికప్పుడే ఈచలాన్ ఇచ్చేవిధంగా కసరత్తులు ప్రారంభించింది. గతంలో ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు.

ఈ నేపథ్యంలో గ్రేటర్ వ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణలో మెరుగైన ఫలితాలు సాధించాలనే పట్టుదలతో అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే వాణిజ్య సంస్థలు రెండు రకాల బిన్స్ ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా కొత్తగా రూపొందించనున్న యాప్ ద్వారా అక్కడికక్కడే ఈ విధించేందుకు బల్దియా కసరత్తులు చేస్తోంది. మరోవైపు కాప్రా సర్కిల్‌తో పాటు పలు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్న సెన్సార్ సీసీ కెమెరాలతో పారిశుద్ధ్య నిర్వహణలో మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. 

అక్కడికక్కడే ఈ 

బల్దియాలో స్వచ్ఛఆటోల ద్వారా ఇంటింటి నుంచి చెత్త సేకరించడంతో పాటు వాణిజ్య సంస్థల వ్యర్థాలను సేకరించడం కూడా పెద్ద సవాల్‌గా నిలుస్తోంది. హోటళ్లు, ఇతర ప్రధాన వ్యాపార సంస్థలు చెత్త నిల్వలను నిబంధనలకు విరుద్ధంగా రోడ్ల వెంట పారబోయడం వంటివి చేస్తున్నారు. దీనికి తోడు హోటళ్ల నుంచి సేకరించే తడి, పొడి చెత్తను వేరు చేయకుండా రెండింటినీ ఒకే బిన్‌లో వేస్తున్నారు. ఈ క్రమంలోనే ముందస్తుగా హోటళ్లతో పాటు ఇతర వాణిజ్య సంస్థలు తప్పనిసరిగా రెండు రకాల బిన్స్ ఏర్పాటు చేసుకోవాలని బల్దియా సూచిస్తోంది.

ఒకవేళ రెండు రకాల బిన్స్ ఏర్పాటు చేయకుంటే.. బల్దియా సిబ్బంది అక్కడికక్కడే ఫోటో తీసి జరిమానా విధించడంతో పాటు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. అందుకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తుంది. ఈ యాప్ రూపకల్పన మరో వారం, పది రోజుల్లో ఫైనల్ కానున్నట్టు బల్దియా అధికారులు చెబుతున్నారు. ముందుగా వాణిజ్య సంస్థలపై ఫోకస్ చేయనున్న బల్దియా అధికారులు ఆ తర్వాత చెత్తనిల్వలను రోడ్లపై వేసేవారికి కూడా జరిమానాలు విధించేందుకు సిద్ధం అవుతోంది. 

కాప్రాలో సెన్సార్ కెమెరాలు.. 

పారిశుద్ధ్య నిర్వహణలో మరింత మెరుగైన చర్యలు చేపట్టేందుకు బల్దియా అధికారులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. కాప్రా సర్కిల్ జీహెచ్‌ఎంసీ శానిటేషన్ సిబ్బంది చొరవతో స్థానిక కాలనీ సంక్షేమ సంఘాలు, ఇతర ప్రైవేట్ సంస్థల సహకారంతో గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సెన్సార్‌తో కూడిన సీసీ కెమెరాలను అమర్చారు. ఈ కెమెరాకు అనుబంధంగా ఓ స్సీకర్‌ను కూడా అమర్చడంతో ఆ ప్రాంతంలో అలికిడి కాగానే ఆటోమేటిక్‌గా మీరు మాకు సీసీ కెమెరాలలో కన్పిస్తున్నారు.

ఇక్కడ చెత్త వేస్తే రూ.1000 పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. మీపై పోలీసు కేసులు కూడా నమోదవుతుందంటూ స్పీకర్ నుంచి వాయిస్ వచ్చేలా జీహెచ్‌ఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో కాప్రా సర్కిల్‌లో చాలా ప్రాంతాలలో చెత్తతో నిండిన ప్రాంతాలన్నీ ప్రస్తుతం చెత్త నిల్వలు లేకుండా పరిశుభ్రంగా ఉంటున్నా యి. అంతే కాకుండా, వివిధ ప్రాంతాలలో టీ స్టాల్స్, గప్‌చుప్ బండ్లు, టిఫిన్ సెంటర్లు, పాన్‌షాపుల వద్ద చెత్త నిల్వలు వేయకుండా 175 మైక్‌లను ఏర్పాటు చేసి నిరంతరం ప్రచారం చేస్తున్నారు. మూడు నెలల క్రితం ప్రారంభించిన ఈ సెన్సా ర్ సీసీ కెమెరాలు ప్రస్తుతం కాప్రా సర్కిల్ వ్యాప్తంగా 65 ఏర్పాటు చేశారు.

కాప్రాను ఆదర్శంగా తీసుకున్న మిగతా సర్కిల్ అధికారులు ఉప్పల్‌లో 23, హయత్‌నగర్‌లో 6, మల్కాజిగిరిలో 8 సెన్సార్ సీసీ కెమెరాలను అక్కడి సిబ్బంది అమర్చారు. ఈ సెన్సార్ కెమెరాల ఏర్పాటు కోసం గ్రేటర్‌లోని 150 డివిజన్లలో స్థానిక వ్యాపారుల, కాలనీ అసోసియేషన్ల సహకారం తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ప్రయోగం మెరుగైన ఫలితాలు ఇవ్వడంతో ఒకప్పుడు చెత్త నిల్వలు పేరుకుపోయిన ప్రాంతంలో పరిశుభ్రమైన తర్వాత ఇతరులకు ఆదర్శంగా నిలవడం కోసం జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది వన భోజనాల కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.