calender_icon.png 3 April, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక ఫోకస్

25-03-2025 01:38:58 AM

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

జనగామ, మార్చి 24(విజయకాంతి): ప్రజావాణిలో వివిధ సమస్యలతో వచ్చే ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. సోమవారం, జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్ (రెవెన్యూ) రోహిత్ సింగ్ లతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్  ఫిర్యాదులను స్వీకరించి, పరిశీలించారు.

ఈ సందర్భంగా (66) ఆర్జీలను కలెక్టర్ స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను  సంబంధిత శాఖల అధికారులకు కేటాయిస్తూ, ప్రజా సమస్యలపై తగిన చర్యలు  తీసుకొని, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఘనపూర్ (స్టేషన్) మండలం, స్థానికంగా నివాసం ఉంటున్న కె. రాజు రెవెన్యూ శాఖకు సంబంధించి తన రెండు ఎకరాల ఆరు గుంటల వ్యవసాయ భూమి పక్కన వాల్టా చట్టం - 2004కు విరుద్ధంగా బోరు వేసి, తమ బోరును నడవకుండా చేసినందున వారిపై తగు చర్యలు తీసుకొనుట కొరకు దరఖాస్తు చేసుకున్నారు.

శివునిపల్లి గ్రామం, ఘనపూర్ (స్టేషన్) మండలానికి చెందిన కటకం వెంకట శ్రీధర్, తన ఇరవై ఒక్క గుంటల భూమి నందు అక్రమ ఇంటి నిర్మాణాన్ని నిలుపుదల చేయుట గురించి దరఖాస్తు చేశారు. ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గం, స్థానికంగా నివాసం ఉంటున్న చింతకుంట నరసింహారెడ్డి, తన నాలుగు గుంటల భూమి 2008లో ఘనపూర్ (స్టేషన్) లోని రిజర్వాయర్ లో భూసేకరణలో తీసుకోగా, అందుకు గాను రూ. 9,52,768 నష్ట పరిహారం వచ్చాయని, వాటిని తాను తీసుకోలేదని, ఆ డబ్బులను ఫార్మ్-ఈ ద్వారా సరెండర్ చేశారని, కావున తన సమస్యను పరిష్కరించి డబ్బులను ఇప్పించుటకు ఆర్జీ ద్వారా కోరారు.

నాగారం గ్రామం, లింగాల ఘనపురం మండలానికి చెందిన కెమిడి రమేష్, తమ పది గుంటల భూమి కాలువ కింద కూలిపోవడం జరిగినందున ఎటువంటి నష్ట పరిహారం పొందలేదని, కావున నష్ట పరిహారం అందించగలరని విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం సమర్పించనైనది. కోలుకొండ గ్రామం, దేవరుప్పుల మండలానికి చెందిన జూకంటి ఐలయ్య, తన 3.04 గుంటల భూమికి సంబంధించిన పట్టా పాసు బుక్కులు మంజూరు అయ్యాయని, వాటిని జారీ చేయుట కోరుతూ దరఖాస్తును సమర్పించినారు.

అదే విధంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారానికై అన్ని మండలాల సంబంధిత తహసీల్దార్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి, అప్పటికప్పుడు దరఖాస్తుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మండలాల స్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని, పెండింగ్ లో లేకుండా దరఖాస్తులను ఎప్పటికప్పుడు పూర్తిచేయాలని ఆదేశించారు.

మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని సరైన విధంగా నిర్వహించాలని, అందుకు తగ్గట్లుగా విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ.. ఎల్‌ఆర్‌ఎస్ క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేసి, ఈ నెల 31 లోగా పూర్తిచేయాలని ఆదేశించారు.

అలాగే తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళికాబద్ధంగా వేసవి కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఎంపిక చేసిన 12 గ్రామాల్లో మార్కింగ్ ను త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ ప్రజావాణిలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, డిప్యూటీ జెడ్పీ సిఈఓ సరిత, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.