calender_icon.png 18 January, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘లక్ష్మీదేవిపల్లి’పై ప్రత్యేక దృష్టి

18-01-2025 12:00:00 AM

  1. రిజర్వాయర్ నిర్మాణాన్ని పక్కన   
  2. పెట్టిన గత సర్కారు పనులు ప్రారంభించేందుకు 
  3. చర్యలు చేపట్టిన ప్రస్తుత ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్న 
  4. ఇరిగేషన్ అధికారులు
  5. త్వరలోనే భూసేకరణ పనులు 
  6. ప్రారంభిస్తామన్న డిప్యూటీ సీఎం ప్రాజెక్టు పూర్తయితే 4.13 లక్షల ఎకరాలకు సాగునీరు

రంగారెడ్డి/చేవెళ్ల, జనవరి 17 (విజయక్రాంతి): గత సర్కారు నిర్లక్ష్యం చేసిన సాగునీటి ప్రాజెక్టులపై ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.  ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ఆయువుపట్టు లాంటి పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటోంది.

ఇందులో భాగంగా పెండింగ్ పనులు పూర్తి చేయడమే కాదు.. బీఆర్‌ఎస్ హయాంలో పక్కన పెట్టిన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇప్పటికే ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.  దీంతో ప్రక్రియ ప్రారంభించిన అధికారులు రిజర్వాయర్, కెనాల్స్కు కావాల్సిన భూసేకరణ, పరిహారానికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో ఉన్నారు.

మూడు రోజుల కింద షాద్నగర్కు వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను స్థానిక నేతలు రిజర్వాయర్ విషయం అడగగా.. నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. 

 పక్కనకు పెట్టిన గత సర్కారు

తెలంగాణ ఆవిర్బావం తర్వాత అధికారంలోకి వచ్చిన సర్కారు 2015 జూన్ 11న పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం(పీఆర్‌ఎల్‌ఐ)ను మొదలుపెట్టింది. ఈ స్కీమ్ కింద ఉమ్మడి పాలమూరు జిల్లాలో నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్తో పాటు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని కొందుర్గు మండలంలో లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మిస్తామని చెప్పింది.

అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ పరిధిలోని ఐదు రిజర్వాయర్ల పనులు ప్రారంభించినా.. లక్ష్మీదేవిపల్లిని మాత్రం ముట్టుకోలేదు.  చివరి రిజర్వాయర్ కాబట్టి మిగితావి పురోగతిలోకి వచ్చాక పనులు మొదలు పెడుతామని చెబుతూ వచ్చింది.  కానీ,  2023 మే నెలలో ఈ రిజర్వాయర్ నిర్మాణాన్ని విరమించుకుంటున్నామని, దీని కింద ప్రతిపాదించిన ఆయకట్టుకు ఉదండాపూర్తోనే సాగునీళ్లు ఇస్తామని చెప్పింది.

డీపీఆర్ ప్రకారం16.3 టీఎంసీలతో చేపట్టిన ఉదండాపూర్కు 4.88 లక్షల ఆయకట్టు ఉంటే.. 2.80 టీఎంసీలు ప్రతిపాదించిన లక్ష్మీదేవి పల్లి 4.13 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ రెండు కలిపితే ఒక్క ఉదండాపూర్ కిందే 9.1 లక్షల ఎకరాల ఆయకట్టు అవుతోంది. ఇది సాధ్యం కాదని అప్పట్లోనే ప్రతిపక్షాలు విమర్శించాయి.

రిజర్వాయర్ కోసం ఆందోళనలు

పీఆర్‌ఎల్‌ఐ స్కీమ్ కింద మొత్తం 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాల్సి ఉండగా.. ఒక్క లక్ష్మీ దేవిపల్లికి కిందనే షాద్ నగర్, పరిగి, కల్వకుర్తి, చేవెళ్ల, ఇబ్రహీం పట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లోని 4.13 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.

అంటే మొత్తం ఆయకట్టులో మూడో వంతు ఈ రిజర్వాయర్ కిందే ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పక్కన పెట్టింది. దీనిపై ప్రతిపక్ష పార్టీల నేతలు, రైతులు అప్పట్లో ఆందోళనలు, ధర్నాలు చేయడంతో పాటు రిజర్వాయర్ను నిర్మించాలని వినతి పత్రాలు కూడా అందించారు.

ఈ రిజర్వాయర్ కెనాల్స్ వెళ్లే ప్రాంతాల్లో ఎక్కువగా రాజకీయ నాయకులు, సినీ స్టార్లు భూములు కొన్నారని అందుకే  వెనక్కి తగ్గిందని ఆరోపణలు కూడా చేశారు. అయినా అప్పటి పాలకులు ఇవేమీ పట్టించుకోలేదు.  

రేవంత్‌రెడ్డి సీఎం కావడంతో... 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఈ ప్రాంతానికే చెందిన రేవంత్ రెడ్డి సీఎం కావడంతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టారు. ఐదు నెలల కింద మహబూబ్నగర్లో నిర్వహించిన సమీక్షలో పీఆర్‌ఎల్‌ఐ  పెండింగ్ పనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నిధుల కొరత లేదని గ్రీన్ చానల్ద్వారా మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.

భూసేకరణ చెల్లింపులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, పెండింగ్ బిల్లులను రెండో ప్రాధాన్యత కింద తీసుకోవాలని ఆదేశించారు.  ఈ సమీక్షకు ముందే మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్‌కు సంబంధించి సెక్రటేరియట్లో ఇరిగేషన్ అధికారులతో రివ్యూ నిర్వహించి భూసేకరణ చేపట్టాలని అదేశించారు.

మూడు రోజుల కింద నాగర్ కర్నూల్ పర్యటనకు వెళ్తూ షాద్నగర్లో ఆగిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సైతం ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మేరకు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్కు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే భూసేకరణ పనులు మొదలవుతాయని వెల్లడించారు.    

హామీని నిలబెట్టుకుంటాం

మా ప్రాంత రైతులకు సాగునీరు అందించే లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఈ రిజర్వాయర్ను నిర్మించాలని నిర్ణయించడం హర్షనీయం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రిజర్వాయర్ను పూర్తిచేసి ఉమ్మడి రంగారెడ్డి, పాలమూరు రైతులకు సాగునీరు అందిస్తాం. 

 పామెన భీమ్ భరత్, కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గ ఇంచార్జి