calender_icon.png 4 November, 2024 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

05-07-2024 01:22:18 AM

  1. వరద ముప్పు నుంచి విముక్తి కల్పిస్తాం 
  2. యుద్ధ ప్రాతిపాదికన అభివృద్ధి పనులు
  3. వీలైనంత త్వరగా 2050 మాస్టర్ ప్లాన్ 
  4. జిల్లా ఇన్-చార్జి మంత్రి పొంగులేటి

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): చారిత్రక వరంగల్ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా అనేక హామీలు ఇచ్చారని, ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని వరంగల్ నగర అభివృద్ధి పనులను యుద్ధ ప్రతిపాదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ అభివృద్ధిపై గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో వరంగల్ జిల్లా మంత్రులు  కొండా సురేఖ, సీతక్క, సీఎం ప్రధాన సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు.

ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి, ఐఆర్‌ఆర్ భూసేకరణ, ఓఆర్‌ఆర్ అలైన్‌మెంట్, వరంగల్ మాస్టర్ ప్లాన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, కుడా మాస్టర్ ప్లాన్, కాళోజీ కళాక్షేత్రం, జీడబ్ల్యూఎంసీ పరిధిలో రిటైనింగ్ వాల్ నిర్మాణం, వరద నివారణ చర్యలు, ఇంకుడు గుంతల నిర్మా ణం, నర్సంపేట మెడికల్ కాలేజీ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరంగల్‌ను హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

2050 నాటికి పెరిగే జనాభాకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్‌ను తయారు చేయాలని ఆదేశించారు. ఇందులో ఫార్మా సిటీ, ఐటీ సర్వీసెస్, మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఎకో టూరిజం, విద్యా సంస్థలు, స్టేడియం, ఎయిర్ పోర్టు, లాజిస్టిక్స్ పార్కు, టూరిజం, ఖమ్మం- రహదారి, కరీంనగర్ రహదారిలో డంపింగ్ యార్డుల ఏర్పాటు వంటి అంశాలు ప్రధానంగా ఉండేలా తయారుచేయాలని సూచించారు. ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌లను త్వరగా తయారు చేయాలని అధికారులకు సూచించారు.  

వేగం పెంచాలి

సెప్టెంబర్ ౯వ తేదీన కాళోజీ జయంతి సందర్భంగా కాళోజీ కళాక్షేత్రాన్ని సీఎం రేవంత్‌రెడ్డి  ప్రారంభిస్తారని, ఆలోగా పెండింగ్ పనులను పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.  నర్సంపేటలోని మెడికల్ కాలేజీ ఈ ఏడాది నుంచి ప్రారంభించడానికి ఉన్న సాధ్యసాధ్యాలను పరిశీలించాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్తును కోరారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణ పనులను వేగవంతం చేయా లని సూచించారు. కాజీపేట అయోధ్యాపురం ఆర్‌వోబీ నిర్మాణ పనుల ఆలస్యంపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

వరంగల్ నగరం వరద ముప్పుకు గురికాకుండా నాలాలను విస్తరించాలని, ఇందు కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. నాలాలు అక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని, ఈ నాలాలను ఆక్రమించిన పేదలకు ఎలాంటి ఇబ్బంది కల గకుండా మరో ప్రాంతానికి తరలించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులు కడియం కావ్య, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డి, కే నాగరాజు, బండ ప్రకాష్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బస్వరాజు సారయ్య, గుండు సుధారాణి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.