calender_icon.png 13 March, 2025 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇటుక బట్టి కార్మికుల పిల్లలకు ప్రత్యేక బోధన

13-03-2025 01:58:03 AM

కరీంనగర్, మార్చి 12 (విజయ క్రాంతి): వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు ప్రత్యేక బోధన అందిస్తామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. బుధవారం గంగాధర మండలం గట్టుబూత్కూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  ఇటుక బట్టి కార్మికుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. అక్కడ చదువుతున్న సుమారు 50 మంది కార్మికుల పిల్లలతో ఒడియా, హిందీలో భాషల్లో మాట్లాడారు.

వారికి ఇస్తున్న ఆహారం, బోధన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్మికుల పిల్లల కోసం యూనిఫామ్, షూ, సాక్సులు, బ్యాగు అందజేస్తామని తెలిపారు. విద్యార్థులు పలు రాష్ట్రాల్లో సంచరించే అవకాశం ఉందని, అందువల్ల వారికి ఇంగ్లీషులో బోధించాలని, సులభంగా అర్థమయ్యే రీతిలో ప్రత్యేక బోధన ఉండాలని ఉపాధ్యాయులకు సూచించారు.

పిల్లలకు వైద్య పరీక్షలు చేయించాలని, రక్తహీనత ఉన్న వారిని  గుర్తించి సరైన చికిత్స, అనుబంధ ఆహారం  అందించాలని ఆదేశించారు. డెంటల్ క్యాంపు నిర్వహించి పరీక్షలు చేయించాలని తెలిపారు. పరిశుభ్రతను, నాణ్యతను గురించి వారికి అవగాహన కల్పించాలని అన్నారు.

గట్టుపుత్కూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆరవ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ బోధించారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టారు. ఉన్నత రంగాల్లో రాణించేందుకు ఇంగ్లీష్ ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటుచేసిన కిచెన్ గార్డెన్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, మండల విద్యాధికారి ఏనుగు ప్రభాకర్ రావు, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి పాల్గొన్నారు.