22-12-2024 01:44:21 AM
హైదరాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): టీబీ వ్యాధి నిర్మూలన కోసం రాష్ట్రంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ౯ జిల్లాల్లో వంద రోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఇందుకోసం ౨౬ మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.
టీబీ ముక్త్ భారత్ అభియాన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో దామోదర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో 2025 చివరి నాటికి టీబీని పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యానికి, తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు.
ఈ నెల 7న ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారభించామని తెలిపారు. ఈ 9 జిల్లాల్లో టీబీ రిస్క్ ఉన్న ప్రజలను గుర్తించి, టెస్టులు చేసేందుకు 26 మొబైల్ టీబీ టెస్టింగ్ వాహనాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.
వంద రోజుల కార్యక్రమానికి సరిపడా టెస్టింగ్ రీఏజెంట్స్, డ్రగ్స్ అందుబాటులో ఉంచామని చెప్పారు. ఇప్పటివరకూ 7,219 మందికి స్క్రీనింగ్ చేయగా, 181 మందికి టీబీ పాజిటివ్ వచ్చిందని కేంద్ర మంత్రికి దామోదర వివరించారు. 2023లో 5.74 లక్షల మందికి టీబీ టెస్టులు చేయగా, 2024లో 7.82 లక్షల మందికి టెస్టులు చేశామని వివరించారు. ట్రీట్‌మెంట్ సక్సెస్ రేటు దేశంలో సగటున 87 శాతం ఉంటే, తెలంగాణలో 90 శాతం ఉందన్నారు.
100 రోజుల్లో టీబీని నిర్మూలించండి
టీబీ పేషెంట్ల గుర్తింపు, ట్రీట్‌మెంట్ కోసం 100 రోజుల్లో టీబీ నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఆదేశించారు. గతేడాది తక్కువ టెస్టులు జరిగిన జిల్లాలను, టీబీ హైరిస్క్ ప్రజలు ఎక్కువగా ఉన్న జిల్లాలను ఈ కార్యక్రమం కోసం కేంద్రం ఎంపిక చేసిందని చెప్పారు. దేశవ్యాప్తంగా 347 జిల్లాల్లో ఈ నెల 7న కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2024 మార్చి 17 వరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది.