- సారా, ముడి సరుకు విక్రేతలపై కఠిన చర్యలు
- ఈ నెల 16 నుంచి వచ్చే నెల 15 వరకు దాడులు
- పకడ్బందీగా ఎక్సుజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రణాళికలు
హైదరాబాద్, జనవరి 15 (విజయక్రాంతి): రాష్ట్రంలో నాటుసారా తయారీదా రులు, ముడిసరుకు వికేత్రలపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం సిద్ధమవుతున్నది. ఈ మేరకు గురువారం నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు స్పెషల్‌డ్రైవ్ నిర్వహించనున్నది. మొత్తం 13 జిల్లాల పరిధిలో 25 మండలాల్లో హాట్‌స్పాట్‌లను గుర్తించి విస్తృతంగా దాడులు చేయనున్నది. దీనిలో భాగంగా ఎక్సైజ్ సిబ్బంది నాటుసారా తయారీదారులు, సారా విక్రేతలు, ముడి సరుకు తయా రీదారులు, సరుకు విక్రేతలను అదుపులోకి తీసుకోనున్నారు.
దాడులకు అవసరమైతే లా అండ్ ఆర్డర్ పోలీసుల సహకారం తీసుకోవాలని రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్‌శాఖ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి సూచిస్తున్నా రు. డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఏఈఎస్‌లు, సీఐలు దాడులను పర్య వేక్షించాలని ఆదేశించారు.
ఈ మండలాల్లో దాడులు..
మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్, లక్షెట్టిపేట, బెల్లంపల్లి మండలాలు, వనపర్తి జిల్లాలోని వనపర్తి, కొత్తకోట మండలాలు, నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట, తేలకపల్లి, కల్వకుర్తి మండలాలు, వరంగల్ రూర ల్ జిల్లాలోని పరకాల, నర్సంపేట, వర్థన్నపేట మండలాలు, మహబూబాబాద్ జిల్లా లోని తొర్రూర్, మహబూబాబాద్, గూడూ రు మండలాలు, భూపాల్‌పల్లి జిల్లాలోని కాటారం, భూపాల్‌పల్లి మండలాలు, నల్లగొండ జిల్లాలోని దేవరకొండ మండలం, భద్రాచలం మండలం, మహబూబ్‌నగర్ మండలం, పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలం, జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలం, నిర్మల్ మండలాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించనున్నారు.