calender_icon.png 8 January, 2025 | 4:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పెషల్ డ్రైవ్ విజయవంతం

01-01-2025 01:16:03 AM

  1. జలమండలి అధికారులు, సిబ్బందికి సీఎం రేవంత్‌రెడ్డి అభినందన
  2. 90 రోజుల్లో 2,200 కి.మీ పైపులైన్, 1.75 లక్షల మ్యాన్‌హోళ్లలో డీ-సిల్టింగ్ 
  3. మరో 90 రోజులు డ్రైవ్ పొడిగించాలని ఆదేశం

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 31(విజయక్రాంతి): సీవరేజ్ ఓవర్ ఫ్లో ఫ్రీ- సిటీగా హైదరాబాద్‌ను నిలపడంతో పాటు నగరంలో ఇంకుడు గుంతల నిర్మాణమే లక్ష్యంగా జలమండలి చేపట్టిన 90 రోజుల స్పెషల్ డ్రైవ్ మంగళవారం పూర్తయ్యింది. అక్టోబర్ 2న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఈ డ్రైవ్ ప్రారంభమైంది.

ఇప్పటివరకు నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్విరామంగా డీ-సిల్టింగ్ పనులు నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా 17,050 ప్రాంతాల్లో 2,200 కిలో మీటర్ల సీవరేజ్ పైపులైన్, 1.75 లక్షల మ్యాన్ హోళ్లలో జలమండలి సిబ్బంది డీ-సిల్టింగ్ పనులు పూర్తిచేశారు. ఫలితంగా జలమండలికి రోజూ వచ్చే సీవరేజ్ ఫిర్యాదులు 30 శాతానికి తగ్గాయి.

స్పెషల్ డ్రైవ్ విజయవంతం కావడంతో సీఎం రేవంత్ రెడ్డి అధికారులు, సిబ్బందిని అభినందించినట్లు జలమండలి వర్గాలు తెలిపాయి. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ 90 రోజుల్లో మంచి ఫలితాలు రావడంతో ఈ డ్రైవ్‌ను మరో 90 రోజులు పొడిగించాలని ఆదేశించారు.

మిగిలిన పైపులైన్లు, మ్యాన్‌హోళ్లలో పూడికతీత పనులు చేపట్టాలని సూచించారు. వర్షాకాలం నాటికి సీవరేజ్ పైపులైన్లు, మ్యాన్‌హోళ్లలో వ్యర్థాలు లేకుండా చూడాలని పేర్కొన్నారు. పైప్‌లైన్, మ్యాన్‌హోళ్లలో ఏండ్ల తరబడి నిలిచిపోయిన సిల్ట్‌ను తొలగించారు. 

మూడేళ్ల ఫిర్యాదుల విశ్లేషణ

ఈ స్పెషల్ డ్రైవ్ పకడ్బందీగా అమలు చేసేందుకు గత మూడేళ్లలో వచ్చిన సీవరేజ్ ఫిర్యాదుల్ని జలమండలి ఎండీ, ఈడీ, ఉన్నతాధికారులు విశ్లేషించారు. ప్రధానంగా వినియోగదారుల ఇళ్లల్లో చోకేజీ, రోడ్లపై సీవరేజ్ ఓవర్ ఫ్లో సమస్యల్ని గుర్తించారు. రోజూ వచ్చే ఫిర్యాదుల్లో 60 శాతం ఇవే రావడంతో వాటిపై దృష్టి సారించి పరిష్కరించారు.

స్పెషల్ డ్రైవ్ పనుల్ని రోజూవారీగా పర్యవేక్షించేందుకు జలమండలిలో అధికారుల వద్ద ప్రత్యేక డాష్‌బోర్డ్ ఏర్పాటు చేశారు. సీవరేజ్ ఓవర్ ఫ్లో, కలుషిత నీరు, రోడ్లపై సిల్ట్ తదితర వాటిపై ఎంసీసీకి వచ్చే ఫిర్యాదులను ఆయా క్యాన్ నంబర్లను జీపీఎస్ ఆధారంగా గూగుల్ మ్యాప్‌లో నమోదు చేశారు. 

సమష్టి కృషితో మంచి ఫలితాలు

సీఎం ఆదేశాలతో ఈ స్పెషల్ డ్రైవ్‌ను ప్రారంభించాం. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో జలమండలి అధికారులు, సిబ్బంది కృషి ఎంతో ఉంది. అందరి సమష్టి కృషితోనే ఇది సాధ్యమైంది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రశంసించడం హర్షణీయం. రాబోయే రోజుల్లో ఇంతకు మించి సామర్థ్యంతో పనులు చేపడుతాం.

  అశోక్ రెడ్డి, జలమండలి ఎండీ