calender_icon.png 23 October, 2024 | 4:46 AM

దీపావళికి 804 ప్రత్యేక రెళ్లు

23-10-2024 02:51:34 AM

గత ఏడాదితో పోలిస్తే 26 శాతం అధికం

హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): దీ పావళి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే 804 ప్ర త్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. పండుగల  సీజన్లో అదనపు రద్దీని క్లియర్ చేయడానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామని అందుకే పెద్ద ఎత్తున ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ద.మ. రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఇందులో భాగంగా దసరా పండుగను పురస్కరించుకుని ప్రత్యేక రైలు సర్వీసులు నడిపినట్లు వెల్లడించారు. అదేవిధంగా దీపావళి, ఛత్ పూజ దృష్ట్యా అదనపు రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు. గత ఏడాది ఇదే సీజన్‌లో 626 ప్రత్యేక రైళ్లను నడపినట్లు వివరించారు.

ఈ ఏడాది ఆ సంఖ్యను పెంచి వివిధ గమ్యస్థానాల మధ్య 804 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించారు. గత ఏడాది కంటే ఈ సంఖ్య 26శాతం అధికమన్నారు. పండుగల సీజన్లలో పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ తదితర రాష్ట్రాల మార్గాల్లో అధిక డిమాండ్ ఉంటుందన్నారు.

తదనుగుణంగా ప్రజల అవసరాలను తీర్చడానికి సికిం ద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ వంటి ప్రధాన స్టేషన్ల నుంచి షాలిమార్, రక్సాల్, జైపూర్, లాల్ఘర్, హిస్సార్, గోరఖ్‌పూర్, షిర్డీ, దానాపూర్, నిజాముద్దీన్, కటక్, అగర్తల, సంత్రాగచ్చి వంటి ముఖ్య మైన నగరాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామన్నారు.

మధురై, ఈరోడ్, నాగర్‌కోయిల్, కొల్లాం, బెంగళూరు, పన్వేల్, దాదర్ మొదలైన ప్రాంతాలకు కూడా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. రైల్వే నెట్‌వర్క్‌లో ఈ నెల చివరి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 6556 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు జరిగాయన్నారు.

అన్ రిజర్వ్‌డ్ కోచ్‌లలో ప్రయాణించేవారు జనరల్ కౌంటర్ల వద్ద క్యూలో నిల్చొని ఇబ్బందులు పడకుండా టిక్కెట్లను యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా కొనుగోలు చేయాలని సూచించారు.