calender_icon.png 19 April, 2025 | 7:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీ మ్యాట్‌పై ప్రత్యేక తరగతులు

19-04-2025 12:29:11 AM

  1. నేటినుంచి టీశాట్‌లో పాఠ్యాంశాల ప్రసారం
  2. టీ శాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయ క్రాంతి): గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్(జీ మ్యాట్) సాధించేందుకు వీలుగా అభ్యర్థులకు శనివారం నుంచి టీ శాట్ ప్రత్యేక తరగతులు ప్రసారం చేయనున్నదని సీఈవో బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కంప్యూటర్ బేస్డ్ మల్టీపుల్ ఛాయిస్ పద్ధతిలో జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీపరీక్షకు విదేశీ విద్య, బిజినెస్, మార్కెటింగ్ విభాగాల్లో అవకాశాలు కోరుకునే వారికి టీ శాట్ చేసే ప్రసారాలు అభ్యర్థుల నైపుణ్యాన్ని పెంచే విధంగా ఉంటాయని పేర్కొన్నారు.

30 రోజులపాటు రోజుకొక్క ప్రోగ్రాం చొప్పున ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు, సాయంత్రం ఆరుగంటల నుంచి ఆరున్నర గంటల వరకు విద్య ఛానల్‌లో పాఠ్యాంశాలు ప్రసారం కానున్నాయని వివరించారు. కాంపిటేటివ్ రీజనింగ్, వెర్బల్ రీజనింగ్, డాటా ఇన్ సైట్స్ సిలబస్‌ను ఉద్దేశించి ఆల్జిబ్రా రీడింగ్ కాంప్రహె న్షన్ రీజనింగ్, డాటా సఫిషియన్సీ, మల్టీ సోర్స్ రీజనింగ్ తదితర అంశాల ఆధారంగా ప్రశ్నావళి సిద్ధం చేసి ప్రసారం చేస్తున్నట్టు తెలిపారు.

ప్రధానంగా బిజినెస్ స్కూళ్లలో విద్యను అభ్యసించి యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, ఇటలీ వంటి దేశాల్లో  ఉద్యోగం పొందాలనుకునే వారు ఈ ప్రసారాలను తప్పనిసరిగా వినియోగిం చుకోవాలని సూచించారు. 

‘వరల్డ్ ఎర్త్ డే’పై స్పెషల్ లైవ్

ఏప్రిల్ 22వ తేదీన వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా టీ నెట్‌వర్క్ ఉదయం 11 గంటలకు ప్రత్యేక లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని సీఈవో బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్, సామాజిక వేత్తలు ప్రత్యేక ప్రసార కార్యక్రమంలో పాల్గొని వరల్డ్ ఎర్త్ డే ప్రాధాన్యాన్ని తెలియజేస్తారన్నారు.