హైదరాబాద్ విజయవాడ మార్గంలో 140 సర్వీసులు
ఆర్టీసీ ఎండీ సజ్జనార్
హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి) ః తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో నగరంలోని ఓటర్లతో పాట వివిధ జిల్లాలకు చెందిన ఓటర్లు తమ సొంత గ్రామాల్లో ఓటు వేసేందుకు పయనమయ్యారు. దీంతో సరిపడా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్ట ర్ వేదికగా స్పందించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటేసేందుకు సొంతూళ్ళకు వెళ్ళే ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందన్నారు.
ఏపీ వైపు ఇప్పటి వరకు 590 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేయగా.. హైదరాబాద్ విజయవాడ మార్గంలో 140 సర్వీసులను అదనంగా నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఆయా బస్సుల్లో సుమారు 3 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయని, విజయవాడ మార్గం వైపు వెళ్ళే ప్రయాణికులు ఈ ప్రత్యేక సర్వీసులను వినియోగించుకోవాలని కోరారు. టీఎస్ ఆర్టీసీ వెబ్సైట్ ద్వారా టికెట్లు ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం, హైదరాబాద్ నుంచి ఆయా జిల్లాలకు 1500 ప్రత్యేక బస్సులను సంస్థ నడపుతోందన్న ఆయన..
జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్ప ల్, ఎల్బీ నగర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులు ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రయాణికుల రద్దీని బట్టి ఎప్పటికప్పుడు బస్సులు అందుబాటులో ఉంచాలని క్షేత్ర స్థాయి అధికారులకు ఆదేశించామన్నారు. ఈ ప్రత్యేక బస్సుల్లో సురక్షితంగా సొంతూళ్ళకు వెళ్ళి తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎక్స్ వేదికగా ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.