calender_icon.png 8 October, 2024 | 3:56 AM

దసరా, బతుకమ్మకు 6,304 స్పెషల్ బస్సులు

08-10-2024 02:01:58 AM

ఆర్టీసీ ఎండీ సజ్జనార్

హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): దసరా, సద్దుల బతుకమ్మ సందర్భంగా 6,304 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. మహాలక్ష్మి పథకం కారణంగా గత దసరాతో పోలిస్తే ఈసారి ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

సోమవారం బస్‌భవన్‌లో దసరా ఆపరేషన్స్‌పై పోలీస్, ఆర్టీఏ, ఆర్టీసీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గతేడాది పోలిస్తే ఈసారి దసరాకు 600 అదనపు బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు దసరా రద్దీ అధికంగా ఉంటుందని, ఆ రోజుల్లో ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. 

జేబీఎస్ నుంచి 1,602, ఎల్బీనగర్ నుంచి 1,193, ఉప్పల్ నుంచి 585, ఆరాంఘఢ్ నుంచి 451 అదనపు బస్సులు నడుస్తాయని తెలిపారు. తిరుగు ప్రయాణం రద్దీ ఎక్కువగా ఉంటే ఈ నెల 13, 14వ తేదీల్లోనూ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు.

ప్రత్యేక బస్సుల సమాచారం కోసం సంస్థ వెబ్‌సైట్ tgsrtcbus.inలో గానీ, 040-69440000, 040-23450033 ఫోన్ నెంబర్లలోగానీ సంప్రదించాలని సజ్జనార్ కోరారు. సమావేశంలో సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవీస్, హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్, ట్రాఫిక్ డీసీపీలు రాహుల్ హెగ్డే, అశోక్‌కుమార్, శ్రీనివాసులు, మనోహర్, ఆర్టీఏలు, ఈడీలు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.