calender_icon.png 20 April, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధ

08-04-2025 12:00:00 AM

జనగామ అడిషనల్ కలెక్టర్  రోహిత్ సింగ్

జనగామ, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): ప్రజావాణి దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జనగామ అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) రోహిత్‌సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ప్రజల నుంచి ఆయన దరఖాస్తులను స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను పరిశీలించి సంబంధిత శాఖ అధికారులకు రెఫర్ చేశారు.

బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామ పరిధిలోని రామచంద్రగూడెంలో 10 సంవత్సరాల క్రితం రైతులు 60 ఎకరాలలో నీలగిరి చెట్లు సాగు చేస్తున్నారు. తద్వారా పరిసరాల్లోని సన్న, చిన్నకారు రైతుల వ్యవసాయ భూములకు వేసుకున్న బోర్లలో నీరు రావడం లేదని, చెట్లు తొలగించేందుకు తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

దేవరపల్లి మండలానికి చెందిన గోలి సోమిరెడ్డి తన వారసత్వ భూమి సర్వే నంబర్లను సరిచేయాలని దరఖాస్తు అందించారు. లింగాలగణపురం మండలం నేలపోగుల రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 435/ 4 లోని 20 కుంటల భూమి, ఇల్లును తన తల్లి భూలక్ష్మి అక్క  స్వరూపకు పట్టా చేసిందని, వారసత్వ హక్కుగా తనకు రావాల్సిన భూమి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.

రఘునాథపల్లి మండలం కూర్చపల్లి గ్రామానికి చెందిన వారాల వెంకటనారాయణ తనకు ఎకరా 22 గుంటల వారసత్వ భూమి 2000 సంవత్సరం నుంచి ధరణి వచ్చేనాటికి పట్టా ఉందని, ధరణి పట్టా పుస్తకంలో అసైన్డ్ భూమి అని నమోదైనందున మార్పు చేయాలని కోరారు.

లింగాలగణపురం మండలం సిరిపురంలో సర్వే నెంబర్ 230/ 82 లో హై టెన్షన్ లైను కొరకు సర్వే చేసి నిర్మాణం చేస్తున్నారని, పరిహారం కొరకు సంప్రదించగా భూమి అధికారులు జాప్యం చేస్తున్నారని చెందిన బొడిగ లక్ష్మయ్య ఆరోపించారు. మొత్తం 43 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో ఆర్డీవో గోపిరామ్, డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని హనుమంత నాయక్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.