calender_icon.png 14 January, 2025 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి

11-12-2024 07:26:43 PM

కలెక్టర్ వెంకటేష్ దోత్రే...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం జిల్లాలోని కెరమెరి మండలం మోడి ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి తరగతి గదులు, వంటశాల, రిజిస్టర్లు, ఆహారం తయారీకి వినియోగించే నిత్యవసర సరుకులు, కూరగాయల నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలన్నారు. ఆహారం తయారీలో తాజా కూరగాయలు, నాణ్యత గల సరుకులను వినియోగించాలని, నాణ్యతలేని సరుకులు వినియోగించినట్లయితే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను బోధించాలని, విద్యార్థినులపై ప్రత్యేక మహిళా ఉపాధ్యాయులతో పర్యవేక్షిస్తూ తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత ఆవశ్యకతను వివరించాలని, త్రాగునీరు, ఆహారం తీసుకునే సమయంలో తప్పనిసరిగా చేతులు శుభ్రపరుచుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. పాఠశాల, వసతి గృహాలలో భోజనశాల, పరిసరాలు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. అనంతరం ధనోరా గ్రామంలోని మండల పరిషత్ తెలుగు, ఉర్దూ మాధ్యమ పాఠశాలలలో విద్యార్థుల మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డి.డి. రమాదేవి, ఎ.టి.డి.ఓ. శ్రీనివాస్, తహసిల్దార్ దత్తు ప్రసాదరావు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి మహమ్మద్ అంజద్ పాషా, ఎస్. సి. ఆర్. పి. శ్యామ్ రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నర్సయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.