కలెక్టర్ వెంకటేష్ దోత్రే...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం రెబ్బెన మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి గదులు, వంటశాల, నిత్యవసర సరుకుల నాణ్యత, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న విద్య బోధన, ఆహార నాణ్యతపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని తెలిపారు. పాఠశాల పరిధిలోని 6 ఏండ్ల పిల్లలు, మధ్యలో బడి మానేసిన వారు తిరిగి పాఠశాలకు వచ్చే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడాలని, హాజరు శాతం పూర్తి స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల హాజరుపై తల్లిదండ్రులకు సమాచారం అందించాలని తెలిపారు.
విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలని, ఆహారం తయారీలో తాజా కూరగాయలు, నాణ్యమైన సరుకులను వినియోగించాలని తెలిపారు. బాలికల సౌకర్యం కోసం మూత్రశాలలు త్వరగా నిర్మించాలని సంబంధిత ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో సేకరించిన సమాచారాన్ని పోర్టల్ లో నమోదు చేసే ప్రక్రియను పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా స్పష్టమైన సమాచారాన్ని నిర్ణీత గడువులోగా పోర్టల్ లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రామ్ మోహన్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.