04-04-2025 12:00:20 AM
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ తో కలిసి జిల్లా అధికారులతో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిలలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంతో పాటు రాష్ట్రస్థాయిలో జిల్లాకు సంబంధించి వస్తున్న దరఖాస్తులపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు.
ప్రజావాణిలో త్రాగునీరు, పోడు భూములు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పింఛన్లు, అంతర్గత రహదారులు, మురుగు కాలువలు, విద్యుత్ తదితర అంశాలకు సంబంధించి ప్రజావాణిలో వస్తున్న దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాకు సంబంధించి అందిన దరఖాస్తులను ఆయా ప్రాంతాల పరిధిలోని అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించి నిర్ణీత గడువులోగా పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.
జిల్లాలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారం కోసం మండల, సబ్ డివిజన్, జిల్లా స్థాయిలలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాల్లో అందుతున్న దరఖాస్తులలో పొందుపరిచిన విషయాన్ని పరిశీలించి రెవెన్యూ రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో సందర్శించి త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులు పెండింగ్ లో లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.