కలెక్టర్ వెంకటేష్ ధోత్రే...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో వసతి పొందుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శనివారం జిల్లాలోని వాంకిడి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం, వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాలను ఆకస్మికంగా సందర్శించి వంట గదులు, విద్యార్థులు నిద్రించే గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని వసతి గృహ సంక్షేమ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నూతన మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన ఆహారాన్ని సకాలంలో అందించాలని, వంట చేసే సమయంలో తాజా కూరగాయలు, నాణ్యత గల నిత్యవసర సరుకులను వినియోగించాలని తెలిపారు.
కాలం చెల్లిన, నాసిరకం సామాగ్రిని వినియోగించినట్లయితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు అదనంగా 10 మూత్రశాలలు, సౌచాలయాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రియాజ్ అహ్మద్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, వసతి గృహ సంక్షేమ అధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.