17-02-2025 11:27:15 PM
హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి..
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): చదువులో వెనుకబడ్డ విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సోమవారం సికింద్రాబాద్ నల్లగుట్ట(ఓల్డ్) ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను కలెక్టర్ అకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ, కిచెన్ రూమ్, మధ్యాహ్న భోజనం కోసం వండిన ఆహారాన్ని పరిశీలించారు. పిల్లలకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. ఉపాధ్యాయులకు తగు సూచనలు చేశారు.
అనంతరం పదో తరగతిని సందర్శించి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కల్పించారు. పరీక్షలు అంటే భయం వీడి ప్రణాళిక బద్దంగా చదివి మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. గత 5,6 సంవత్సరాల పరీక్ష పేపర్లను తీసుకోని బాగా ప్రాక్టీస్ చేయాలని సూచించారు. జీవితంలో నిలదొక్కుకొనేందుకు పదవ తరగతి పరీక్షలు టర్నింగ్ పాయింట్ లాంటిదని, బాగా చదవడంతోపాటు స్లిప్ టెస్ట్ లు రాయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీధర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ గుండప్ప, స్వరూప, కృష్ణమూర్తి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
స్కూల్ ఎడ్యుకేషన్‌పై నేడు బహిరంగ విచారణ
స్కూల్ ఎడ్యుకేషన్‌పై హైదరాబాద్ జిల్లాలో మంగళవారం పబ్లిక్ హియరింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. లక్డీకాపూల్‌లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నేడు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ బహిరంగ విచారణకు తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి హాజరై బహిరంగ విచారణ జరుపుతారని తెలిపారు.