ప్రత్యేక అధికారుల సమావేశంలో పిఓ రాహుల్...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): గిరిజన పిల్లల చదువు అభివృద్ధి చెందాలంటే మీ సొంత పిల్లలను ఏ విధంగా చదివించుకుంటున్నారో, గిరిజన పిల్లలను కూడా మీ పిల్లల భావించి చదువులో వెనుకబడ్డ పదవ తరగతి పిల్లలను గుర్తించి చక్కటి విద్య అందించే దిశగా స్పెషల్ ఆఫీసర్లు, ప్రత్యేక చొరవ చూపాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్(ITDA Project Officer B. Rahul) అన్నారు. శుక్రవారం నాడు రాత్రి ఐటిడిఏ సమావేశం మందిరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల ప్రత్యేక అధికారులు, ఏటీడీఓలు పదవ తరగతి గిరిజన విద్యార్థిని విద్యార్థులకు బోధిస్తున్న ఉపాధ్యాయుల పనితీరు, పదవ తరగతి ఫలితాలపై తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్పెషల్ ఆఫీసర్ లు పదవ తరగతిలో చదువులో వెనుకబడ్డ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని, పాఠశాలలో హెచ్ఎంల పనితీరు మెరుగుపరుచుకునేలా చూడాలని, మీరు సందర్శనకు వెళ్ళినప్పుడు హెచ్ఎంలు చెప్పింది వినకుండా సొంతంగా పిల్లల చదువు ఏ విధంగా నడుస్తున్నది గమనించాలని అన్నారు.
పదవ తరగతి పిల్లల కోసం సరఫరా చేసిన మెటీరియల్ పిల్లలు ఫాలోఅప్ చేస్తున్నది లేనిది చూడాలని, సంక్రాంతి పండుగ సెలవులకు ఇండ్లకు వెళ్లి తిరిగి పాఠశాలలకు చేరుకున్న పిల్లలను ఎవరిని ఇండ్లకు పంపకూడదని, స్పెషల్ ఆఫీసర్లు(Special Officers) వారానికి ఒకరోజు తప్పనిసరిగా వారి పరిధిలోని పాఠశాలను ఉదయం విజిట్ చేసి పిల్లల సబ్జెక్టులకు సంబంధించిన అంశాలను పరిశీలించాలని, సాయంత్రం విజిట్ చేసినప్పుడు తప్పనిసరిగా రాత్రి స్టడీ అవర్స్, డిన్నర్ చెక్ అప్ చేయాలని అన్నారు. పదో తరగతి పిల్లలకు సరఫరా చేసిన స్టడీ మెటీరియల్(Study Material) వినియోగిస్తున్నది లేనిది చూడాలని, కొత్త మెనూ ప్రకారం ఆహారము అందుతున్నది లేనిది చూసి పిల్లలు అందరికీ సరిపడా భోజనం పెట్టే విధంగా చూడాలని అన్నారు.
అవసరమైతే ప్రైమరీ స్కూల్లను కూడా అప్పుడప్పుడు సందర్శించి సలహాలు సూచనలు ఇస్తూ ఉండాలని అన్నారు. టీచర్లు సమయపాలన పాటించే విధంగా చూసి స్టడీ అవర్స్ చెక్ చేస్తూ ఉండాలని అన్నారు. స్పెషల్ ఆఫీసర్ల పనితీరు మెరుగుపరుచుకొని తప్పనిసరిగా వారికి కేటాయించిన పాఠశాలలను విజిట్ చేసి పదో తరగతి పిల్లలు అందరూ అత్యుత్తమ మార్కులతో పాస్ అయ్యేలా చూడాలని అన్నారు. పాఠశాలలకు ఏమైనా మైనర్ రిపేర్లు ఉంటే వెంటనే దానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించే విధంగా హెచ్ఎం లకు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఖమ్మం డిటిడిఓ విజయలక్ష్మి, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ చంద్రశేఖర్, స్పెషల్ ఆఫీసర్లు, ఏసీఎంవో రమణయ్య, రాములు, ఏటీడీవోలు జహీరుద్దీన్, చంద్రమోహన్, అశోక్ కుమార్, రాదమ్మ తదితరులు పాల్గొన్నారు.