calender_icon.png 6 January, 2025 | 5:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

30-12-2024 02:46:23 AM

  1. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మృతికి సంతాపం 
  2. భారతరత్న ఇవ్వాలని సభలో తీర్మానం! 
  3. ఏర్పాట్లను పరిశీలించిన స్పీకర్ ప్రసాద్‌కుమార్, మంత్రి శ్రీధర్‌బాబు
  4. సీఎస్, పోలీస్ ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్

హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): తెలంగాణ అసెంబ్లీ సోమవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక సమావేశం ప్రారంభం కానున్నది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను  స్పీక ర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, శాసనసభ సెక్రటరీ వీ నరసింహాచార్యులు ఆదివా రం పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. సభ్యులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవా లని, అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం సీఎస్ శాంతికుమారి, ఉన్నతాధికారులు, డీజీపీ, పోలీసు అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో మాదిరిగానే ఈ సమావేశాలకు కూడా ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలని కోరారు.

ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకుని సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మృతికి సంతాపం తెలపనున్నారు. ఇతర ఎజెండా అంశాలు లేకుండా కేవ లం మన్మోహన్ చేసిన సేవలను గుర్తు చేసుకునేందుకు సభ పరిమితం కానున్నది. 

మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైన విషయాన్ని సభలో ప్రస్తావించనున్నారు. భారతరత్న ఇవ్వాలని సభలో తీర్మానం చేసే అవకాశం ఉన్నది. అదేవిధంగా మన్మోహన్‌సింగ్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ప్రకటన  చేయనున్నట్టు తెలుస్తోంది.

కాగా.. ఆరు గ్యారెంటీల్లో ఒక పథకానికి మన్మోహన్‌సింగ్ పేరును పెట్టాలనే ప్రతిపాదన సైతం ప్రభుత్వం ముందున్నట్టు సమాచారం.