హైదరాబాద్, అక్టోబర్ 21(విజయక్రాంతి): వికారాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(వీయూడీఏ) ఏర్పాటు పట్ల అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వీయూడీఏ ద్వారా వికారాబాద్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, 493 గ్రామాల అభివృద్ధి పనులకు ప్రభుత్వం భారీగా నిధులను వెచ్చిస్తుందని చెప్పారు.
అలాగే పట్టణాల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్‌ను రూపొందించవచ్చని పేర్కొన్నారు. పట్టణాలతో పాటు శివారు ప్రాంతాలకు మౌలిక వసతులను కల్పించవచ్చని వివరించారు.
ఔటర్ రింగు రోడ్లను నిర్మించుకోవచ్చని, ఆవాసాలకు అనుగుణంగా వాటర్ ట్యాంకులను విస్తరించుకోవచ్చని, పరిశ్రమలతో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించుకోవచ్చని తెలిపారు. వీయూడీఏను ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.