- తక్షణమే వివరాలు అందించాలని ఎస్‌ఈలు, ఎస్‌ఏవోలకు మార్గదర్శకాలు జారీ చేసిన ఫైనాన్స్ డైరెక్టర్ సుధామాధురి
- చెక్కుబౌన్స్ వ్యవహారంలో నిబంధనలు పాటించాలని సూచన
- విజయక్రాంతి కథనంతో కదిలిన ఎస్పీడీసీఎల్
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 29 (విజయక్రాంతి): దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) ఫేక్ చెక్కుల వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ నెల 26న విజయక్రాంతి దినపత్రికలో ప్రచురితమైన ‘విద్యుత్ బిల్లులకు ఫేక్ చెక్కులు’ కథనంపై స్పందించిన సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఇప్పటికే సెంట్రల్ సర్కిల్ ఎస్‌ఈ వెంకన్నను విచారణ చేయాలని ఆదేశించారు.
తాజాగా మొత్తం టీజీఎస్పీడీసీఎల్ కంపెనీలోని 21 సర్కిల్స్‌లో ఉన్న చెక్కు బౌన్స్‌ల వివరాలను తక్షణమే అందించాలని ఫైనాన్స్ విభాగం డైరెక్టర్ కే సుధామాధురి సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్‌ఈ)లు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్(ఎస్‌ఏవో)లకు సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
ఈ వ్యవహారంపై రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు సైఫాబాద్, ఇందిరాపార్కు, ఆజామాబాద్, రేతిబౌలి, ఏసీ గార్డ్స్ ఈఆర్వో కార్యాలయాలలో తనిఖీలు చేసి సంబంధిత వివరాలు సేకరించారు. కాగా, ఇదే సమయంలో చెక్కులు బౌన్స్ అయితే అధికారులు పాటించాల్సిన మార్గదర్శ కాలపై దిశానిర్దేశం చేశారు.
లీగల్ నోటీసులు జారీ చేయాలని..
వినియోగదారులు విద్యుత్ సంస్థకు ఇచ్చే చెక్కుల విషయంలో అధికారులు నిబంధనలు పాటించాలని ఫైనాన్స్ డైరెక్టర్ సుధా మాధురి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఆ చెక్కులు గడువు (డ్యూ డేట్) మేరకు ఉన్నాయో లేవో పరిశీలన చేయాలని, చెక్కు అందిన మూడ్రోజుల్లో క్లియర్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఒకవేళ ఏదైనా వినియోగదారుడి చెక్కు బౌన్స్ అయినట్లయితే ఏడాది కాలం వరకు అట్టి వినియోగదారుడు చెక్కు ద్వారా చెల్లింపులు చేయడానికి అనర్హుడిగా ప్రకటించాలని తెలిపారు. చెక్కు బౌన్స్ కాగానే సదరు వినియో గదారుడికి నోటీసులు జారీ చేయాలని, అవసరం అయితే చట్ట ప్రకారం లీగల్ నోటీసు లు ఇవ్వాలన్నారు.
ఈ విషయాలన్నింటినీ ఎస్‌ఈలు తమ పరిధిలో ఎప్పటికప్పుడు పరిశీలన, పర్యవేక్షణ చేయాలన్నారు. ఇప్పటి వరకు డిస్ హానర్ (బౌన్స్ చెక్కులు) ఎన్ని ఉన్నాయి.. ఎంతమందికి నోటీసులు జారీ చేశారు.. ఈ జాబితాలోని చెక్కులు ఏమైనా ఫేక్ ఉన్నాయా, లేదా అనే విషయాల పట్ల అధికారులు సీరియస్‌గా వ్యవహారించాలని సూచించారు.
ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్‌లో ఎస్పీడీసీఎల్ పరిధిలోని 10 మంది ఎస్‌ఈలు, ఎస్‌ఏవోలు, రూరల్ జోన్ పరిధిలోని 11 జిల్లాల ఎస్‌ఈలు, ఎస్‌ఏవోలకు మార్గదర్శకాల ఆదేశాలతో పాటు విజయక్రాంతి పత్రిక ప్రచురించిన కథనాన్ని కూడా జోడించి పంపారు.