calender_icon.png 29 September, 2024 | 7:02 AM

చెన్నైలో ఓ రోడ్డుకు ఎస్పీబీ పేరు

26-09-2024 12:43:03 AM

పాటల బాటలో సాగిపోతూ తన గానంతో ఎందరో సంగీతాభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని పదిలపర్చుకున్న సంగీత శిఖరం బాలసుబ్రహ్మణ్యం. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, మళయాలంతోపాటు మొత్తం 16 భాషల్లో పాటలు పాడి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారు. అలాంటి సంగీత శిఖరానికి తమిళనాడు ప్రభుత్వం అరుదైన గౌరవాన్నిచ్చింది.

చెన్నై నగరంలోని నుంగంబాక్కం ప్రాంతంలో ఉన్న కాందార్‌నగర్ మెయిన్ రోడ్డుకు ‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం’ పేరు పెట్టనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తాజాగా ప్రకటించారు. ఇక నుంచి ఆ రహదారిని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రోడ్‌గా వ్యవహరించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.

గాయకుడు ఎస్పీ చరణ్ చెన్నైలోని కాందార్‌నగర్ మెయిన్ రోడ్డుకు తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు పెట్టాలని ఇటీవల సీఎం స్టాలిన్‌ను విజ్ఞప్తి చేశారు. ఆయనకు ఆ రోడ్డుతో ఉన్న అనుబంధం కారణంగా పేరు పెట్టడం ఆయనకు ఇచ్చే గౌరవం అవుతుందని వివరించారు.

దీంతో ఎస్పీ బాలు వర్ధంతి సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం.. ఎస్పీబీ పేరును సదరు రోడ్డుకు పెడుతూ నిర్ణయం తీసుకున్నది. సీఎం స్టాలిన్ నిర్ణయం పట్ల బాలు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.