calender_icon.png 28 March, 2025 | 5:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో ప్రారంభం.. అంతలోనే అగ్నిప్రమాదం

21-03-2025 01:10:14 AM

- కన్వె న్షన్ హాలులో వెల్డింగ్ పనులు.. ఎగిసిపడిన మంటలు 

- శంషాబాద్ మండలం తొండుపల్లి లో భారీ అగ్ని ప్రమాదం  

 రాజేంద్రనగర్, మార్చి 20 (విజయ క్రాంతి): త్వరలో ప్రారంభం కానున్న కన్వెన్షన్ హాలులో వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పురవ్వలు ఎగిసిపడి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సంఘటన శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని తొండుపల్లిలో గురువారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తొండుపల్లి గ్రామంలోశ్రీధర్ శెట్టి, మహేష్ యాదవ్ ఏకం ఎఎం పేరు తో భారీ కన్వెన్షన్ హాలు నిర్మిస్తున్నారు. పనులు తుదిదశకు చేరుకున్నాయి. వచ్చే నెల మొదట్లో ప్రారంభించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఉదయం కన్వెన్షన్ హాలులో వెల్డింగ్ పనులు చేసేటప్పుడు నిప్పురవ్వలు కింద ఉన్న మ్యాట్ పై పడిపోవడంతో భారీగా మంటలు వ్యాపించాయి.

10.30 గంటలకు డయల్ 100 కు కాల్ చేయడంతో శంషాబాద్ పోలీస్ స్టేషన్ పెట్రోల్ మొబైల్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మహేశ్వరం నుంచి మరో ఫైర్ ఇంజన్ రప్పించారు. అతి కష్టం మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే భారీగా మంటలు, పొగ ఎగిసిపడటంతో సానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగిందని సమాచారం. కన్వెన్షన్ హాలు నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.