calender_icon.png 16 January, 2025 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పెయిన్ x ఫ్రాన్స్

09-07-2024 12:25:11 AM

మ్యూనిచ్: యూరోపియన్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. ఈ టోర్నీలో అత్యధిక గోల్స్ కొట్టిన స్పెయిన్.. అతి తక్కువ గోల్స్ బాదిన ఫ్రాన్స్‌తో అమీతుమీకి సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ప్రారంభం కానున్న పోరులో స్పెయిన్‌తో ఫ్రాన్స్ తలపడనుంది. క్వార్టర్‌ఫైనల్లో జర్మనీపై గెలిచి స్పెయిన్ ముందంజ వేయగా.. పోర్చుగల్‌ను ఇంటిబాట పట్టించి ఫ్రాన్స్ సెమీస్‌లో అడుగుపెట్టింది. గ్రూప్ దశలో ఆస్ట్రియాతో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ ఫ్రాన్స్ స్టార్ స్ట్రయికర్ కిలియన్ ఎంబాపే మరోసారి మాస్క్‌తో బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు.

ఈ టోర్నీలో ఇప్పటి వరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన ఎంబాపే.. కీలక సెమీస్‌లో సత్తాచాటాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశిస్తుండగా.. స్పెయిన్ సమష్టితత్వాన్నే నమ్ముకుంది. తాజా టోర్నీలో స్పెయిన్ ఆడిన అన్నీ మ్యాచ్‌ల్లో గెలవగా.. మరోవైపు ఫ్రాన్స్ మాత్రం ‘డ్రా’లతో గట్టెక్కుతూ ముందుకు వచ్చింది. గ్రూప్ భాగంగా క్రొయేషియా, ఒటలీ, అల్బేనియాపై విజయాలు సాధించిన.. ప్రిక్వార్టర్స్‌లో జార్జియాపై నెగ్గింది. క్వార్టర్స్‌తో కలుపుకొని స్పెయిన్ ఇప్పటివరకు మొత్తం 11 గోల్స్ కొట్టింది.

అదే సమయంలో ఫ్రాన్స్ గ్రూప్ ఆస్ట్రియాపై నెగ్గి నెదర్లాండ్స్, పోలాండ్‌తో మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. ప్రిక్వార్టర్స్‌లో బెల్జియంపై గెలిచింది. పోర్చుగల్‌తో క్వార్టర్స్‌లో నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్స్ నమోదు చేయలేకపోగా.. పెనాల్టీ షూటౌట్‌లో ఫ్రాన్స్ ముందంజ వేసింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఫ్రాన్స్ 3 గోల్స్ మాత్రమే కొట్టింది. అందులో పోలాండ్‌పై ఎంబాపే ఒక గోల్ నమోదు చేశాడు. ఇరు జట్లు యూరో కప్‌లో 36 సార్లు తలపడగా.. అందులో స్పెయిన్ 16 మ్యాచ్‌ల్లో, ఫ్రాన్స్ 13 మ్యాచ్‌ల్లో గెలిచాయి. స్పెయిన్‌కు ఇది ఆరో సెమీఫైనల్‌కాగా.. ఫ్రాన్స్ గతంలో ఐదుసార్లు సెమీస్‌కు చేరి అందులో మూడుసార్లు ట్రోఫీ ఎగరేసుకుపోయింది. మరి సమఉజ్జీల సమరంలో పైచేయి ఎవరిదో.!