calender_icon.png 2 November, 2024 | 5:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వర్షాలతో స్పెయిన్ విలవిల

02-11-2024 12:30:16 AM

  1. 140 మంది మృతి
  2. వందలమంది గల్లంతు

 మాడ్రిడ్, నవంబర్ 1: యూరోపియన్ కంట్రీ స్పెయిన్ భారీ వర్షాలతో విలవిలలాడుతోంది. దాదాపు వంద సంవత్సరాల తరువాత భారీ వానలు పడుతుండడంతో దేశమంతా అతలాకుతలమవుతోంది. ఎడతెరపిలేని వర్షాలు బీభత్సం సృష్టించడంతో ఇప్పటివరకు 140 మంది చనిపోయారు.

వందల మంది గల్లంతయ్యారు. వరదల్లో కొంతమంది కొట్టుకుపోగా, బురదలో కూరుకుపోయి మరికొంత మంది చనిపోయారు. గల్లంతైన వారిని రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తునారు. దాదాపు 1,200 మంది సైనికులు గల్లంతైన వారి ఆచూకీ కోసం వెతుకున్నారు. రోడ్లపై పేరుకుపోయిన బురదను తొలగిస్తున్నారు.

వరదల్లో చాలామంది కొట్టుకుపోయారు. బురదలో మునిగిన వాహనాల్లో  ప్రజలు చనిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికీ భారీ వాన పడుతుండడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

మరికొన్ని రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలందరూ ఇండ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. భారీ వరదలతో వాలెన్సియా నగరం అతలాకుతలమైంది.నగరంలో ఎక్కడ చూసినా రోడ్లపై బురద పేరుకుపోయి పరిస్థితి దారుణంగా ఉంది.

భారీ వరదల నుంచి తమను కాపాడుకోవడానికి ప్రజలు ఇండ్ల పైకి చేరుతున్నారు. వరదల కారణంగా రోడ్డు, రైలు రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వేలమంది నిరాశ్రయులను తాత్కా లిక సహాయ శిబిరాలకు పంపించారు. తూర్పు వాలెన్సియా, కాస్టెలాన్ పట్టణవాసులు ప్రభుత్వ సూచనలు పాటించాలని ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్ సూచించారు. అత్యవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దని హెచ్చరించారు. మృతులకు సంతాప సూచకంగా దేశంలో మూడు రోజులు సంతాప దినాలను ప్రకటించారు.