* మరో అద్భుతానికి ఇస్రో సిద్ధం
* ఇదే తుది దశ
* ఏం జరగనుందో?
న్యూఢిల్లీ, జనవరి 6: డిసెంబర్ 30న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి పంపిన స్పేడెక్స్ మిషన్‌లోని రెండు ఉపగ్రహాలను ఈ నెల 9న డాకింగ్ చేయనున్నారు. రెండు ఉపగ్రహాలైన చేసర్, టార్గెట్‌లను ఒక్కటి చేసి మరో అపూర్వ ఘట్టానికి తెర లేపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఉవ్విళ్లూరుతున్నారు.
డాకింగ్ టెక్నాలజీతో భారత్ ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఇదే కావడం గమనార్హం. తొలి ప్రయోగంలోనే విజయాన్ని రుచి చూసిన ఇస్రో చివరి అడుగును కూడా విజయవంతంగా పూర్తి చేసేందుకు తహతహలాడుతోంది. చేసర్, టార్గెట్‌లను జనవరి 9న అనుసంధానించేందుకు ఇస్రో సన్నద్ధం అవుతోంది.
తగ్గుతూ వస్తున్న దూరం
ఈ రెండు ఉపగ్రహాల మధ్య దూరం క్రమంగా తగ్గుతూ వస్తోంది. మొదట్లో ఈ రెండు ఉపగ్రహాల మధ్య 20 కి.మీ దూరం ఉన్నా అది క్రమంగా తగ్గింది. యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ శంకరన్ మాట్లాడుతూ.. ‘విజయవంతంగా డాకింగ్ ప్రక్రియను పూర్తి చేయాలంటే రెండు ఉపగ్రహాల మధ్య దూరం తగ్గాలి.
రెండు ఉపగ్రహాల మధ్య 5 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ఉంటే ఇంటర్ శాటిలైట్ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా ఒకదానికొకటి కమ్యూనికేట్ చేసుకుంటాయి’ అని తెలిపారు.
కళ్లన్నీ ఇస్రో పైనే..
ఈ ఒక్క అడుగులో ఇస్రో విజయవంతమైతే డాకింగ్ టెక్నాలజీతో ప్రయోగం చేపట్టిన నాలుగో దేశంగా ఆవిర్భవిస్తుంది. జనవరి 9న జరగనున్న ఈ ప్రక్రియ కోసం దేశం మొత్తం ఇస్రో వైపు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ మిషన్ విజయవంతం మీద భారత అంతరిక్ష కేంద్రం, మానవ సహిత తొలి రోదసీ యాత్ర వంటివి అనేకం ఆధారపడి ఉన్నాయి.