మేడ్చల్, నవంబర్ 8: మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన మల్లారెడ్డి యూనివర్సిటీలో స్థల వివాదం ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. బహుదూర్‌పల్లికి చెందిన పిట్ల వీరయ్యకు 641 642, 643, 644 సర్వే నంబర్లలో మొత్తం 7 ఎకరాల తొమ్మిది గుంటల భూమి ఉండేది. ఆతడికి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు ఇద్దరు, రెండో భార్యకు ఒక కుమారుడు ఉన్నారు.
వీరయ్య.. తన ఆస్తులకు సంబంధించి ముగ్గురు కొడుకులకు సమానంగా వీలునామా రాశాడు. అయితే, మొదటి భార్య కొడుకులు 1970వ సంవత్సరంలో ఆ స్థలాన్ని మల్లారెడ్డికి విక్రయించారు. అయితే, తన వాటా తనకు రావాలని రెండో భార్య కుమారుడు యాదగిరి కోర్టును ఆశ్రయించారు. దీంతో సంబంధిత స్థలంలో సర్వే చేయించుకోవాలని కోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో శుక్రవారం సర్వేయర్, లాయర్ అక్కడికి వెళ్లారు.
ప్రస్తుతం ఆ స్థలంలో మల్లారెడ్డి యూనివర్సిటీ నిర్మించారు. తమకు కూడా కోర్టు.. నోటీసు ఇస్తేనే సర్వే చేయిస్తామని యూనివర్సిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ యాదగిరికి, యూనివర్సిటీ సిబ్బందికి నడుమ వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అధికారులు సర్వే చేయకుండానే వెనుదిరిగారు.