calender_icon.png 15 October, 2024 | 1:56 AM

శాంతితోనే అభివృద్ధి సాధ్యం

11-09-2024 09:18:27 PM

సామాజిక మాధ్యమాలలో వచ్చే వదంతులను నమ్మద్దు

జైనూర్ ఘటన నేపథ్యంలో ఆదివాసీలతో ఎస్పీ సమావేశం

ఆదిలాబాద్,(విజయక్రాంతి): శాంతి మార్గం ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ శాంతి కోసం కృషి చేస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యువతకు అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఆదివాసి పెద్దలకు సూచించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనుర్ లో జరిగిన ఘటన నేపథ్యంలో ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా దర్బార్ లో ఆదివాసీ నాయకులతో జిల్లా ఎస్పీ బుధవారం సమావేశమైయ్యారు. ముందుగా ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా ఆలయంలో ఎస్పీ నాగోబా ను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.  అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదివాసీ నాయకులతో మాట్లాడి వారి  ఆసౌకర్యాలు, ఇబ్బందులపై ఎస్పీ అరా తీశారు. 

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... ముఖ్యంగా ఆదివాసీల సమస్యలపై ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తామని తెలిపారు. సమస్యలను  పరిష్కరించటానికి జిల్లా పోలీసు యంత్రాంగం ఎల్లవేళలా సహాయ సహకారాలను అందిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులలో పుకార్లను నమ్మవద్దని, సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని సూచించారు. పోలీసులకు విచారించే సమయాన్ని ఇవ్వాలని దోషులకు శిక్షపడే విధంగా విచారణ కొనసాగుతుందని భరోసా ఇచ్చారు. చట్టం దృష్టిలో పోలీసుల దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానమని తెలిపారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని వెల్లడించారు.

ఆదివాసీలు శాంతియుతంగా ఉండి ప్రభుత్వ పరంగా వచ్చే లబ్ధి, సదుపాయాలను ఉపయోగించుకుని యువతకు ఉన్నత విద్యను అభ్యసించి ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. యువత విద్యపై దృష్టి సారించే విధంగా పెద్దలు మార్గదర్శనం చేయాలని సూచించారు. తద్వారా ఆదివాసీలు పూర్తిగా అభివృద్ధి చెందుతారని తెలిపారు. మెడికల్ క్యాంపులు, పుస్తకాల పంపిణీ, స్పోర్ట్స్ స్కిట్స్ పంపిణీ, బ్లాంకెట్ల పంపిణీ లాంటివి నిర్వహిస్తూ ఆదివాసులను అభివృద్ధి పరుస్తూ ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ డిఎస్పి  సిహెచ్ నాగేందర్, సీఐ మొగిలి, ఎస్సై సునీల్, ఆదివాసి పెద్దలు సిడం భీమ్ రావు, సార్ మెడీ జిల్లా అధ్యక్షుడు మెస్రం దుర్గు, పటేళ్లు, తుడుం దెబ్బ నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.