calender_icon.png 13 April, 2025 | 2:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దక్షిణాది దండయాత్ర

13-04-2025 12:40:14 AM

ఒకప్పుడు బాలీవుడ్ వారే ప్రత్యేక పాత్రల్లో సౌత్ స్క్రీన్‌పై కనిపించేవారు. ఇప్పుడు రోజులు మారాయి.. భారతీయ సినిమా విప్లవాత్మక అభివృద్ధిని సాధించింది. అది సాంకేతికత పుణ్యమో.. సామాజిక మాధ్యమాల వెసులుబాటో కానీ, దక్షిణాది తారలు ప్రపంచ సినీ అవనికపై తళుక్కున మెరుస్తున్నారు. హిందీ మార్కెట్లోనూ మనోళ్ల సక్సెస్ ‘రేట్’ పెరుగుతోంది. 

ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. ఇది దయాగాడి దండయాత్ర.. అంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ గుర్తుకొస్తోంది. ఎందుకంటే ఒకప్పుడు తెలుగు తెరపై ఇతర పరిశ్రమల నటీనటులు కనిపిస్తే బొమ్మ బ్లాక్‌బస్టర్ అన్నట్టుండేది. అమ్రిష్‌పురి నుంచి నేటి బాబీ డియోల్ దాకా కీలక పాత్రల్లో మెరిసిన బాలీవుడ్ నటులంతా అలా తెలుగు తెరకు పరిచ యమైనవారే.

మరి ఆ నటుల సమకాలీనులకు హిందీ సినిమాల్లో అవకాశాలు  ఏ మేరకు దక్కాయంటే.. గొంతులో వెలక్కాయ పడ్డట్టే అవుతుంది మనవాళ్లకు. ఇక్కడ ప్రతిభావంతులు లేకనా? కాదు, దక్షిణాదిపై ఓ చిన్నచూపు అంతే!

పాన్ ఇండియా మెచ్చిన సౌత్ స్టార్స్..

పాన్ ఇండియా సినిమాకు విశేష ఆదరణ లభిస్తున్న కారణంగా టాలీవుడ్, కోలీ వుడ్, మాలీవుడ్.. ఇలా అన్ని దక్షిణాది చిత్ర పరిశ్రమల్లోని ప్రతిభావంతులకు ఆదరణ లభిస్తోంది.  సినిమా రంగంలో వచ్చిన సాంకేతిక మార్పుల కారణంగా సౌత్ సినిమా నేడు ప్రపంచ ప్రేక్షకులకు చేరవవుతోంది.

ఇక్కడ నిర్మితమై ప్రపంచ సినీ ప్రేక్షకుల దాకా ఇప్పటికే చేరిన, ఇంకా చేరనున్న సినిమాలెన్నో! మొన్నటి ‘బాహుబలి’, ‘సలార్’, ‘కేజీఎఫ్’తోపాటు నిన్నటి ‘ఆర్‌ఆర్‌ఆర్’, ఇటీవలి ‘పుష్ప’ వరకు అన్నీ దక్షిణాది వారి దండయాత్రలో భాగమే! రేపటి ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ కూడా ప్రపంచ స్థాయి ప్రేక్షక హృదయాలను రంజింపజేసేదే!  ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, యశ్, రిషబ్ శెట్టి వంటి హీరోల ప్రతిభతోపాటు రాజమౌళి, సందీప్‌రెడ్డి వంగా వంటి దర్శకుల సత్తా ప్రపంచ సినిమా వేదికపై ఆవిష్కృతమైన తర్వాత బాలీవుడ్‌లోని పెద్ద పెద్ద స్టార్స్ కూడా దక్షిణాది వారితో సినిమాలు చేసేందుకు ఇష్టపడటం మొదలైంది.

ఇండియాలో బాలీవుడ్డే అసలు రాజు అని హాలీవుడ్ వారు అనుకున్న ఒకానొక సందర్భంలో పాన్ ఇండియన్ సినిమా రూపంలో దక్షిణాది దండయాత్ర వారి అభిప్రాయాన్ని పూర్తిగా మార్చివేసింది. 

బాలీవుడ్‌లో మనోళ్లు.. 

బాలీవుడ్‌లో దక్షిణాదికి చెందిన స్టార్స్ భాగమయ్యారు. ఇందులో ఎన్టీఆర్ పేరు ముందుగా చెప్పుకోవాలి.  ‘వార్’ కు సీక్వెల్‌గా ‘వార్ 2’ రూపొందుతోంది. ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ రా ఏజెంట్‌గా నటిస్తున్నాడట. ఈ క్యారెక్టర్ గతంలో ఏజెంట్ పాత్రల్లో నటించిన సల్మాన్, హృతిక్, షారుక్‌లకు భిన్నంగా ఉంటుందట. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

షూటింగ్ దాదాపు పూర్తయిందని, ఆగస్టు 25న విడుదలయ్యే అవకాశం ఉందని రైటర్ అబ్బాస్  వెల్లడించారు. మరో సౌత్ స్టార్ ధనుష్ ప్రస్తుతం ‘తేరే ఇష్క్ మే’ అనే హిందీ సినిమాలో నటిస్తున్నాడు. కృతిసనన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా కథను హిమాన్షు శర్మ, నీరజ్ యాదవ్ రచించగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తూ హిమాన్షు శర్మ, భూషణ్‌కుమార్, కృష్ణకుమార్‌తో నిర్మిస్తున్నారు.

ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 28న విడుదల కానుంది. ఇలా మరికొన్ని బాలీవుడ్ ప్రాజెక్టుల్లో రజనీకాంత్, కమల్‌హాసన్ వంటి ప్రముఖులు భాగమవుతున్నారు. 

రాబోయే సినిమాలు మరికొన్ని..

‘ఎస్‌ఎస్‌ఎంబీ29’.. రాజమౌళి భావి బ్లాక్‌బస్టర్.   మహేశ్‌బాబు హీరోగా, పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్న ఈ మూవీ బడ్జెట్ 800 కోట్లపైమాటే. అంటే, ఇండియాలోనే ఇప్పటివరకూ వచ్చిన అన్ని సినిమాలకన్నా అత్యంత ఖరీదైనదన్నమాట. ఈ సినిమా 2026లో రాబోతోంది. ఇక ‘కేజీఎఫ్ 3.. ‘పార్ట్2లోనే మూడో భాగం గురించి అనౌన్స్ చేశారు మేకర్స్. 

పార్ట్3లో కూడా యశ్ గ్యాంగ్‌స్టర్‌గా దుమ్ములేపబోతున్నాడు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్న ఈ సినిమా 2027లో రానుంది.  ‘విక్రమ్ 2’ సినిమా కూడా సౌత్ ఇండస్ట్రీ సత్తా చూపించబోతోంది. ఇది ‘విక్రమ్’కు సీక్వెల్. ఆ సినిమాలో సూర్య కేవలం ఐదు నిమిషాలే కనిపించారు. ఆ ఒక్క సీనే రూ.500 కోట్ల దాకా వసూలు చేసింది.

మరి ‘విక్రమ్ 2’లో విక్రమ్.. సినిమా మొత్తం ఉంటారంటే అప్పడు వచ్చే వసూళ్లు ఏ స్థాయిలో ఉంటాయో కదూ! దక్షిణాది దిగ్గజ నటీనటులు భాగమవుతున్నారు. లోకేశ్ కనగరాజ్ తీస్తున్న ఈ సినిమా 2026లో రాబోతోంది. సౌత్‌లో మరికొన్ని పాన్ ఇండియా ప్రాజెక్టులూ రూపొందుతున్నాయి. 

నరేశ్ ఆరుట్ల