calender_icon.png 20 September, 2024 | 3:26 PM

సౌత్ టు నార్త్.. వయా జహీరాబాద్

19-09-2024 12:34:08 AM

ఆంధ్రా, ఒడిశాలో గంజాయి సేకరించి తరలింపు

జాతీయరహదారి- 65 మీదుగానే రవాణా

స్థానికంగా ఏజెంట్ల నిమాయకం.. ఎస్కార్ట్‌లుగా వారి సేవలు

చక్రం తిప్పుతున్న స్మగ్లర్లు

సంగారెడ్డి, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన గంజాయి స్మగ్లర్లు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఎండు గంజాయి కొనుగోలు చేసి  ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సంగారెడ్డి జిల్లాలో పట్టుబడుతున్నారు. సీసీఎస్ పోలీసులు ప్రత్యేకంగా నిఘా వేసి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని బాల్కికి చెందిన గంజాయి స్మగ్లర్లు జిల్లాలో పలువురు ఏజెంట్లను నియమించుకోని గుట్టుచప్పుడు కాకుండా సరకును సరిహద్దులు దాటిస్తున్నారు. అలా గంజా యి ముంబై, పుణె, బీదర్, ఢీల్లీ  వంటి నగరాలకు తరలివెళ్తున్నది. జిల్లా పరిధిలోని జహీరాబాద్ కేంద్రంగా కొందరు ఏజెంట్లు ఇక్కడి నుంచి రవాణా సాఫీగా సాగేలా చూస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

జాతీయ రహదారి నుంచే..

అక్రమార్కులు గంజాయి రవాణాకు ప్రైవేట్ కారులు, ట్రావెల్స్ బస్సులను వినియోగిస్తున్నారు. అర్ధరాత్రి చెక్‌పోస్టుల వద్ద నిఘా సిబ్బంది కళ్లుగప్పుతున్నారు. అవసరమైతే కొందరి చేయి తడిపి మరీ రవాణా దందా కొనసాగిస్తున్నారు. కొన్నిసార్లుతై తాము నడుపుతున్న వాహనాల్లో గంజాయి ఉందనే సంగతి డ్రైవర్లు, క్లీనర్లకు తెలుసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. 65 వ జాతీయ రహదారి పై పోలీసు నిఘా లేకపోవడంతో మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన స్మగ్లర్లు జోరుగా అక్రమ రవాణా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  పటాన్‌చెరు ఓఆర్‌ఆర్ నుంచి రాష్ట్ర సరిహద్దు వరకు ఎక్కడ వాహనల తనిఖీలు చేయడం లేదు.

దీంతో స్మగ్లర్లు ముందుగా ఒక్క వాహనంతో వెళ్లి ఎక్కడ పోలీసులు తనిఖీలు లేకపోతే వెంటనే గంజాయి తరలిస్తున్న వాహన డ్రైవరుకు సమాచారం ఇస్తారని తెలిసింది. ముందుగా వెళ్లిన వ్యక్తి రాష్ట్ర సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను అంచనా వేసి స్మగ్లర్లకు అందిస్తారని తెలిసింది. ఎక్కడైన జాతీయ రహదారి పై పోలీసులు ఉంటే వాహనంను నిలిపివేస్తారని తెలిసింది. పోలీసులు వెళ్లిన వెంటనే జాతీయ రహదారిపైకి వచ్చిన వాహనంతో వెళ్లిపోతున్నట్లు తెలిసింది. ఈ నెల 10న చిరాగ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మడ్గి చౌరస్తా వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వాహనం ట్రాలీలో కంకరా, ఇసుక పైన వేసి కింద ఎండు గంజాయిని తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. 

పోలీసుల కళ్లుగప్పి..

ఇతర రాష్ట్రాలకు చెందిన స్మగ్లర్లు జహీరాబాద్ ప్రాంతానికి చెందిన కొందరు యువకులను ఏజెంట్లుగా నియమించుకుంటున్నారు. వీరు ఇతర ప్రాంతాల నుంచి గంజాయి ప్రత్యేక వాహనంలో వస్తుండగా.. ఏజెంట్లు ఎవరికీ అనుమానం రాకుండా కాస్ట్లీ కార్లలో ఫాలో చేస్తారని తెలిసింది. పటాన్‌చెరు ముత్తంగి ఓఆర్‌ఆర్ నుంచి తెలంగాణ సరిహద్దు వరకు కొత్త కారులో ఎస్కార్ట్‌గా వెళ్లి జాతీయ రహదారిపై ఉన్న నిఘాను స్మగ్లర్లకు తెలియ జేస్తారని తెలిసింది. వాస్తవానికి ఏజెంట్లు నిరుపేదలైన ప్పటికీ గంజాయి దందా పుణ్యమా అని లగ్జరీ కార్లలో తిరుగుతున్నారని సమాచారం. ఒకవేళ సదరు వాహనాన్ని ఎవరైనా పోలీసులు ఆపితే తాము ఇంతకు ముందే వివిధ రాజకీయ పార్టీల్లో ముఖ్యనేతలతో దిగిన సెల్ఫీలను చూపి మస్కా కొడతారు.

ఎవరీ మల్లుగొండ.. ?

కర్ణాటకలోని బాల్కికి చెందిన మల్లుగొండ అనే వ్యక్తి  గంజాయి దందాలో చక్రం తిప్పుతున్నట్లు పోలీస్ విచారణలో తేలినట్లు తెలుస్తున్నది. దందాకు ప్రత్యేకంగా ఓ ముఠాను ఏర్పాటు చేసుకొన్నట్లు సమాచారం. జహీరాబాద్ ప్రాంతంలో అక్రమార్కులకు అనుచురులు ఉన్నారా.. లేదా అనే కోణంలో సీసీఎస్ పోలీసులు విచారణ చేపడుతున్నట్లు విశ్వసనీయమైన సమాచారం. మరోవైపు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొందరు పంటల మధ్య గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ జహీరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి, ఆందోల్ డివిజన్లలో కొందరు  గంజాయిని అంతర పంటగా సాగు చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇంత బాహాటంగా గంజాయి రవాణా, సరఫరా జరుగుతున్నా ఎక్సైజ్‌శాఖ, పోలీస్‌శాఖలు నామమాత్రంగా తనిఖీలు చేపడుతున్నారని, ఆయా శాఖలు సీరియస్‌గా స్పందించి గంజాయి దందాపై ఉక్కుపాదం మోపాలని జిల్లావాసులు కోరుతున్నారు.