* ఎమర్జెనీ విధింపు నిర్ణయంతోనే కటకటాల పాలు
సియోల్, జనవరి 15: ఉన్నట్టుండి దేశం లో ఎమర్జెన్సీ ప్రకటించి దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కటకటాల పాలయ్యారు. ప్రతిపక్ష పార్టీ నేతలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని డిసెంబర్‌లో దేశంలో ‘ఎమర్జెన్సీ మా ర్షల్ లా’ విధించారు. ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.
దేశా ధ్యక్షుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ప్రతిపక్షాలు ఈ క్రమంలో పార్లమెంట్‌లో అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం పెట్టాయి. చట్టసభలో అభిశంసన తీర్మానం నెగ్గడంతో యూన్ సుక్ యోల్ అధ్యక్ష అధికారాలు కోల్పోయారు.
ఈ క్రమంలో బుధవారం ఉదయం సియోల్‌లోని యూన్ సుక్ యోల్ నివాసంలో దర్యాప్తు సంస్థల అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి ఆయన్ను కొద్దిరోజుల క్రితమే అదుపులోకి తీసుకోవాల్సి ఉండగా, అధికారులకు అనేక అవాంతరాలు ఎదుర య్యాయి. దీంతో అరెస్ట్ సాధ్యం కాలేదు. తాజాగా అధికారులు పక్కా వ్యూహం రచించి యూన్ సుక్ యోల్‌ను అదుపులోకి తీసుకున్నారు.