calender_icon.png 19 January, 2025 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీడీపీలో దక్షిణాదే టాప్

19-09-2024 02:54:38 AM

30 శాతం భాగస్వామ్యం 5 రాష్ట్రాలదే

తలసరి ఆదాయంలోనూ సత్తా చాటిన సౌత్

బీహార్, యూపీ జీడీపీ వాటా, తలసరి ఆదాయంలోనూ లాస్ట్

పీఎం ఆర్థిక సలహా మండలి నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: దేశంలోని రాష్ట్రాల ఆర్థిక పనితీరులో గణనీయమైన అసమానతలు ఉన్నట్లు ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి నివేదిక వెల్లడించింది. కొన్ని రాష్ట్రాలు భారత జీడీపీకి అధికమొత్తంలో భాగస్వామ్యం అందిస్తుండగా మరికొన్ని మాత్రం స్వల్ప మొత్తంలో సహకరిస్తున్నాయి. కొన్నేళ్లుగా కొన్ని రాష్ట్రాలు ఆర్థిక వృద్ధిలో దూసుకుపోతుంటే.. గతంలో ధనిక రాష్ట్రాలుగా పేరొందినవి పతనాన్ని చవిచూస్తున్నాయి. నివేదిక భారత జీడీపీకి దక్షిణాది రాష్ట్రాలు ప్రధాన వాటాదారులుగా ఉద్భవించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు భారత జీడీపీలో అధిక వాటాను అందిస్తున్నాయి. కాగా, ఒకప్పుడు ఆర్థికంగా బలంగా ఉన్న పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు అస్పష్టమైన పతనాన్ని చవిచూశాయి. 

30 శాతం దక్షిణాది నుంచే..

1991లో దక్షిణాదిలోని 5 పెద్ద రాష్ట్రాల తలసరి ఆదాయం జాతీయ సగటు కన్నా తక్కువగా ఉండేది. ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ మొదలైన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ గణనీయమైన వృద్ధి సాధించి ఈ రాష్ట్రాలు ఆర్థికంగా పుంజుకునేలా చేసింది. 2024 మార్చి నాటికి భారత జీడీపీలో ఈ రాష్ట్రాల వాటా 30 శాతంగా ఉంది. ఐటీ సెక్టార్‌తో కర్ణాటక, ఇండస్ట్రియల్ హబ్‌లతో తమిళనాడు భారీ స్థాయిలో వృద్ధిని సాధించాయి. 2014లో యువ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ తక్కువ కాలంలోనే మెరుగైన వృద్ధిని సాధించి భారత ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. 

పతనంవైపు బెంగాల్ 

60వ దశకంలో 10.5 శాతం వాటాతో భారత జీడీపీలో కీలక భాగస్వామిగా బెంగాల్ ప్రస్తుతం 5.6 శాతానికి పడిపోయింది. తలసరి ఆదాయంలోనూ గతంలో జాతీయ సగటుతో పోలిస్తే 127.5 శాతం ఉండేది. ప్రస్తుతం 83.7 శాతానికి పడిపోయి రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల దిగువకు చేరింది. దశాబ్దాలుగా వెస్ట్ బెంగాల్ ఆర్థిక పనితీరు నిరంతర క్షీణతను నమోదు చేస్తోందని నివేదిక తెలిపింది. సముద్రతీర రాష్ట్రాల్లో బెంగాల్ ఒక్కటే ఈ విధంగా ఉందని పేర్కొంది. తొలినాళ్లలో ఉన్న ఆర్థిక బలాన్ని నిర్వహించలేకపోవడమే ఈ పతనానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. 

పంజాబ్, హర్యానా భిన్న తీరులు

హరిత విప్లవం ద్వారా అత్యధిక లబ్ధి పొందిన పంజాబ్ పనితీరు కూడా క్షీణత వైపు వెళుతోంది. 1991 నుంచి దాని ఆర్థిక వృద్ధి స్తబ్దుగా సాగుతోంది. 1971లో తలసరి ఆదాయం జాతీయ సగటు కన్నా 169 శాతం ఉండగా ప్రస్తుతం 106 శాతానికి పడిపోయింది. మరోవైపు హర్యానా మాత్రం వేగంగా వృద్ధి సాధిస్తోంది. తలసరి ఆదాయం 176.8 శాతానికి చేరింది. ఒకప్పుడు పంజాబ్ కన్నా వెనుకబడి ఉన్న హర్యానా ఇప్పుడు దానిని అధిగమించింది. 

నివేదికలో ఇతర అంశాలు..

  1. భారత జీడీపీలో మహారాష్ట్రదే అగ్రస్థానం. కానీ కొన్నేళ్లుగా దాని వాటా 15 శాతం నుంచి 13.3 శాతానికి పడిపోయింది. మహారాష్ట్ర తలసరి ఆదాయం 150.7 శాతానికి పెరిగినా టాప్ 5 రాష్ట్రాల్లో మాత్రం చోటు దక్కించుకోలేపోయింది.  
  2. జీడీపీలో యూపీ వాటా 1960 14 శాతం ఉంటే ప్రస్తుతం 9.5 శాతానికి తగ్గింది. 
  3. మూడో అతిపెద్ద జనాభా కలిగిన రాష్ట్రంగా బీహార్ కేవలం 4.3 శాతం వాటా కలిగి ఉంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బీహార్ పూర్తిగా వెనుకబడి ఉంది. కాగా, వెనుకబడిన రాష్ట్రంగా పేర్కొనే ఒడిశా మాత్రం పురోగతి సాధిస్తోంది.   
  4. ఆర్థిక సరళీకరణల తర్వాత వివిధ రాష్ట్రాలు విభిన్న ఆర్థిక మార్గాల్లో పయనిస్తున్నాయని నివేదిక పేర్కొంది. సంస్కరణలను ఉపయోగించుకుని దక్షిణాది రాష్ట్రాలు లాభపడి జాతీయ వృద్ధిని నడిపించాయని స్పష్టం చేసింది. ఈ ప్రాంతీయ అసమానతలు విస్తరిస్తోన్న నేపథ్యంలో రాష్ట్ర స్థాయి ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే విధానాలు, కారకాలపై లోతైన దర్యాప్తు చేయాలని నివేదిక కోరింది.   

తలసరి ఆదాయం 

జాతీయ సగటుతో పోలిస్తే

ధనిక రాష్ట్రాలు

రాష్ట్రం 1960-61 2023-24

(శాతాలలో) (శాతాలలో)

ఢిల్లీ 218.30 250.80

తెలంగాణ - 193.60

కర్ణాటక 96.7 180.70

హర్యానా 106.90 176.80

తమిళనాడు 109.20 171.10

పేద రాష్ట్రాలు

రాష్ట్రం 1960-61 2023-24

(శాతాలలో) (శాతాలలో)

బీహార్ 70.30 32.80

జార్ఖండ్ - 57.20 

యూపీ 82.40 50.80 

మణిపూర్ 50.30 66

అస్సాం 102.90 73.70