- ఫైనల్లో సౌతాఫ్రికా
- అఫ్గానిస్థాన్‌పై ఘన విజయం
ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా ఫైనల్లో అడుగపెట్టింది. చోకర్స్ ముద్రను చెరిపేసుకొని టైటిల్ గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు చాంపియన్‌గా నిలవడానికి అడుగు దూరంలో నిలిచారు. మెగాటోర్నీ ఆరంభం నుంచి సంచలన విజయాలు సాధిస్తూ వచ్చిన అఫ్గానిస్థాన్ సెమీస్‌లోనూ అదే తరహా ప్రదర్శన చేస్తుందేమోనని అంతా భావించారు. గ్రూప్ దశలో న్యూజీలాండ్, సూపర్ మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాతో పాటు బంగ్లాదేశ్‌లను ఓడించి సెమీస్‌లో అడుగపెట్టింది. అయితే అఫ్గానిస్తాన్ ఆటలు ప్రొటీస్ ముందు సాగలేదు. బలమైన బౌలింగ్ లైనప్‌కు అఫ్గాన్ బ్యాటింగ్ కకావికలమైంది.
పదునైన బంతులు బులెట్లలా దూసుకొస్తుండడంతో ఆ జట్టు బ్యాటర్ల వద్ద సమాధానం లేకుండా పోయింది. ఏడాది కాలంగా నిలకడైన ప్రదర్శనతో పెద్ద జట్లను మట్టికరిపిస్తూ వచ్చిన అఫ్గానిస్థాన్ ఈసారి మెగాటోర్నీలో సెమీస్‌కు చేరడమే వారికి అతి పెద్ద విజయం. మెగాటోర్నీల్లో నాకౌట్ దశ అంటేనే తీవ్ర ఒత్తిడికి లోనయ్యే సఫారీలు ఈసారి మాత్రం ఎలాంటి పొరపాటు చేయలేదు. తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సెమీస్‌లో ఆద్యంతం ఆధితప్యం కనబరిచి ఫైనల్లో అడుగపెట్టిన సఫారీలు అందని ద్రాక్షగా మిగిలిపోయిన ఐసీసీ టైటిల్‌ను ఒడిసిపడతారేమో చూడాలి..!
ట్రినిడాడ్: పొట్టి ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా చాంపియన్‌గా నిలవడానికి అడుగు దూరంలో నిలిచింది. గురువారం ట్రినిడాడ్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్లో సఫారీ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తద్వారా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టింది. ఆద్యంతం బౌలర్ల హవా కొనసాగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 11.5 ఓవర్లలో 56 పరుగులకు ఆలౌటైంది. అజ్మతుల్లా (10) ఒక్కడే రెండంకెల స్కోరు దాటగా.. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చిన 13 పరుగులు ఇన్నింగ్స్‌లో అత్యధిక కావడం గమనార్హం. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సన్, తబ్రయిజ్ షంసీలు చెరో 3 వికెట్లు పడగొట్టారు. నోర్టే, రబాడలు తలా 2 వికెట్లు తీశారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో సఫారీలు 8.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 60 పరుగులు చేసి గెలుపొందింది. రీజా హెండ్రిక్స్ (25 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్సర్), మార్కరమ్ (21 బంతుల్లో 23 నాటౌట్; 4 ఫోర్లు) ఆడుతూ పాడుతూ జట్టును విజయతీరాలకు చేర్చారు. అఫ్గాన్ బౌలర్లలో ఫజల్లా ఫరుఖీ ఒక వికెట్ పడగొట్టాడు. బౌలింగ్‌తో అఫ్గాన్ల పతనాన్ని శాసించిన మార్కో జాన్సన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకున్నాడు.
బౌలర్ల చెడుగుడు..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకోవడంతోనే అఫ్గాన్ల కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. నిప్పులు చెరిగే బంతులతో సఫారీ బౌలర్లు అఫ్గానిస్థాన్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. పదునైన బంతులకు క్రీజులో నిలదొక్కుకోవడమే కష్టంగా మారింది. కన్ను మూసి తెరిచేలోపు వికెట్లు టపాటపా రాలాయి. టోర్నీ ఆధ్యంతం నిలకడగా రాణించిన ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్‌ను జాన్సన్ డకౌట్‌గా పెవిలియన్ చేర్చడంతోనే అఫ్గాన్ల వికెట్ల పతనం ప్రారంభమైంది. ఒక ఎండ్ నుంచి జాన్సన్.. మరో ఎండ్ నుంచి నోర్టే ఇబ్బంది పెట్టడంతో అఫ్గానిస్థాన్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. 28 పరుగులకే ఆరు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఈ దశలో అజ్మతుల్లా, కరీమ్ జనత్‌లు కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. 9 ఓవర్లలో అఫ్గాన్ స్కోరు 50 పరుగులకు చేరింది. అయితే కేవలం ఆరు పరుగుల వ్యవధిలో మిగతా 4 వికెట్లు కోల్పోయిన అఫ్గాన్ ఆలౌటైంది.
ఆడుతూ పాడుతూ..
స్వల్ప లక్ష్యాన్ని సఫారీలు ఆడుతూ పాడుతూ చేధించారు. ఫామ్‌లో ఉన్న బ్యాటర్ క్వింటన్ డికాక్ 5 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఈ దశలో హెండ్రిక్స్‌కు జత కలిసిన మార్కరమ్ జట్టును విజయం దిశగా నడిపించాడు. ఈ ఇద్దరు అఫ్గాన్ బౌలర్లకు ఏ మాత్రం అవకాశమివ్వకుండా జట్టును గెలిపించారు. తద్వారా టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు చేరుకొని సఫారీ జట్టు చరిత్ర సృష్టించింది.