దుబాయ్: ప్రతిష్ఠాత్మక మహిళల టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం రాత్రి జరిగిన సెమీఫైనల్లో ఆరుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. బెత్ మూనీ (44) టాప్ స్కోరర్.
ప్రొటీస్ బౌలర్లలో కాకా 2 వికెట్లు తీయగా.. కాప్, లాబా చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 135 పరుగుల టార్గెట్‌ను సఫారీలు 17.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆడుతూ పాడుతూ చేధించారు. అన్నెకె బోస్క్ (74 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించగా.. కెప్టెన్ లారా వోల్వర్ట్ (42) రాణించింది.
కాగా మెగాటోర్నీలో సౌతాఫ్రికా ఫైనల్లో అడుగుపెట్టడం వరుసగా ఇది రెండోసారి. గతేడాది పొట్టి ప్రపంచకప్‌లోనూ ఫైనల్లో అడుగుపెట్టిన సఫారీలు రన్నరప్‌కే పరిమితమయ్యారు. నేడు జరగనున్న మరో సెమీస్‌లో వెస్టిండీస్, న్యూజిలాండ్ అమీతుమీకి సిద్ధమయ్యాయి.